అమెరికా తర్వాత హైదరాబాద్ లో గూగుల్ పెద్ద ఆఫీసు

అమెరికా తర్వాత హైదరాబాద్ లో  గూగుల్ పెద్ద ఆఫీసు
  • గూగుల్ పెద్ద​ క్యాంపస్​కు శంకుస్థాపన
  • 33 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు
  • అమెరికా బయట కంపెనీకిదే పెద్ద ఆఫీసు

హైదరాబాద్​, వెలుగు:గూగుల్​ హైదరాబాద్​లో 7.3 ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద ఆఫీసు కడుతోంది. అమెరికాలోని మౌంట్​ వ్యూ ఆఫీసు తర్వాత రెండో పెద్ద ఆఫీసు ఇదే కానుంది. ఈ క్యాంపస్​ భూమి పూజను గురువారం నాడు  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావు చేశారు.  33 లక్షల చదరపు అడుగుల  పెద్ద క్యాంపస్ ​ఏర్పాటు చేస్తున్నందుకు గూగుల్​కు కేటీఆర్​ కృతజ్ఞతలు చెప్పారు. గచ్చిబౌలి వద్ద కొత్త క్యాంపస్​ ఏర్పాటు కానుంది. 2019లోనే ఈ స్థలాన్ని గూగుల్​ తీసుకుంది. గూగుల్​ కట్టబోయే బిల్డింగ్​ డిజైన్​ను కూడా కేటీఆర్​ లాంఛ్​ చేశారు .

రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ..

రాష్ట్రంలోని యువత, మహిళా ఎంట్రప్రెనూర్లకు డిజిటల్​ ఎకానమీని చేరువ చేసేందుకు ఈ సందర్భంగా గూగుల్​, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేటీఆర్​ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గూగుల్​ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు గూగుల్​ కెరీర్​ సర్టిఫికెట్ల కోసం స్కాలర్​షిప్పులను అందిస్తారు. మహిళా ఎంట్రప్రెనూర్లకు డిజిటల్​, బిజినెస్​, ఫైనాన్షియల్​ స్కిల్స్​లో ట్రెయినింగ్​నూ గూగుల్​ అందిస్తుంది. స్కూళ్ల మోడర్నైజేషన్​ ప్రాజెక్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్​ అండగా నిలుస్తుంది. స్కూళ్లకు డిజిటల్​ టీచింగ్​, లెర్నింగ్​ టూల్స్​, సొల్యూషన్స్​ను గూగుల్​ అందించనుంది. 

వ్యవసాయంలోనూ ..

పబ్లిక్​ ట్రాన్స్​పోర్టేషన్​ మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సాయపడతామని కూడా గూగుల్​ ప్రకటించింది. వ్యవసాయం రంగం కోసమూ డిజిటల్​ టెక్నాలజీలను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. గూగుల్​తో చాలా ఏళ్లుగా తమ బంధం బలపడుతూ వస్తోందని చెబుతూ, ఇది సంతోషకరమైనదని ఐటీ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గూగుల్​ మొదటి నుంచీ సపోర్ట్​ అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, ఐటీ సెక్టార్​ డెవలప్​మెంట్‌లో గూగుల్​ పాత్ర కూడా ఉందని చెప్పారు. తమకు హైదరాబాద్​లోనే ఎక్కువ మంది ఉద్యోగులున్నారని గూగుల్​ కంట్రీ హెడ్​, వైస్​ప్రెసిడెంట్​ సంజయ్​ గుప్తా చెప్పారు.