చేనేత కళకు చేయూత.. ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో వస్త్ర ప్రదర్శన

చేనేత కళకు చేయూత..  ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో వస్త్ర ప్రదర్శన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చేనేత కళకు చేయూత, నేతన్న కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ఐపీఎస్‌‌‌‌ అధికారుల సతీమణుల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంప్రదాయ వస్త్రాలకు విస్తృత మార్కెట్‌‌‌‌ కల్పించే లక్ష్యంతో ‘థ్రెడ్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హోప్‌‌‌‌–వేర్‌‌‌‌ ఎవరీ థ్రెడ్‌‌‌‌ టెల్స్‌‌‌‌ ఎ స్టోరీ’ పేరిట చేనేత, హస్తకళల ప్రదర్శన నిర్వహించింది. మసాబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లోని పోలీసు అధికారుల మెస్‌‌‌‌లో శుక్రవారం ఎగ్జిబిషన్‌‌‌‌ ఏర్పాటు చేశారు.

సంఘం అధ్యక్షురాలు, డీజీపీ సీవీ ఆనంద్ సతీమణి లలితా ఆనంద్‌‌‌‌, కార్యదర్శి రీతూ జైన్‌‌‌‌ ఆధ్వర్యంలో ఈ  కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. జమ్దానీ, కలంకారీ, దుబ్బాక లినెన్‌‌‌‌ చీరలపై హ్యాండ్‌‌‌‌ ఎంబ్రాయిడరీతో పాటు నారాయణపేట, గద్వాల్‌‌‌‌, పోచంపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల సంప్రదాయ చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

లలితా ఆనంద్‌‌‌‌ మాట్లాడుతూ.. దేశ సాంస్కృతిక వారసత్వంలో సంప్రదాయ చేనేత కళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పలువురు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో సుమారు రూ.13 లక్షల మేర వ్యాపారం జరిగింది.