కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలి..

కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలి..

ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్‌పై ఫిఫా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. కేంద్రం తరఫున  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదోపవాదాలను వినిపించారు. AIFF సస్పెన్షన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఫిఫాతో చర్చలు కూడా జరిపిందని కోర్టుకు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అంశాన్ని ఆగస్టు 22 సోమవారం నాటికి వాయిదా వేయాలని కేంద్రం తరఫున అభ్యర్థించాడు. సస్పెండ్ అనంతరం ఫిఫాతో రెండు సమావేశాలు నిర్వహించినట్లు కూడా తుషార్ మెహతా వెల్లడించారు. 

కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలి..
U17 ఫుట్బాల్ వరల్డ్ కప్ భారత్ లో నిర్వహించేందుకు.. AIFFపై ఫిఫా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. U17 ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహించడం వల్ల భారతదేశానికి ఫుట్బాల్ విషయంలో లబ్ధి చేకూరాలని సుప్రీం సూచించింది. 

భారత ఫుట్బాల్ చరిత్రలో మాయని మచ్చ..
AIFF ఫిఫా చట్టాలను ఉల్లంఘించినందుకే  సస్పెండ్ చేసినట్లు  FIFA కౌన్సిల్ బ్యూరో చెప్పింది.  AIFF 85ఏళ్ల ఉనికిలో తొలిసారి FIFAచే నిషేధాన్ని ఎదుర్కోవడంతో భారత ఫుట్బాల్ చరిత్రలో ఈ ఘటన ఓ మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే సస్పెండ్ను ఎత్తివేసేందుకు కేంద్ర క్రీడాశాఖ  FIFAతో  నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతోందని ఫుట్బాల్ పాలకమండలి పేర్కొంది. 

బయటి వ్యక్తుల జోక్యంతో వేటు..
భారత ఫుట్బాల్ ఫెడరేషన్ లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటంతో...ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్పై  ఫిఫా వేటు వేసింది.  ఇలాంటి  అసోసియేషన్లను  తాము గుర్తించలేమని స్ఫష్టం చేసింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకే ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్పై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య సస్పెన్షన్పై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్కు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యకలాపాలను సాగిస్తోంది. దీంతో ఫిఫాలో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువైంది. ఈ విషయంపై భారత్ను ఫిఫా పలుమార్లు హెచ్చరించింది. అయినా భారత సమాఖ్య పట్టించుకోలేదు. దీంతో ఫిఫా నిషేధం విధించింది.