బార్ కౌన్సిల్ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బార్ కౌన్సిల్ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
  •   జనవరి 31లోపు పూర్తి చేయాలని మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్​ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి బార్ కౌన్సిల్​ల ఎన్నికలు పూర్తి చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. లేకపోతే ఎన్నికల నిర్వహణకు కోర్టు కమిషన్​ను నియమిస్తామని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని మరో 24 రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికలు రెండేండ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. 

దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్ 32పై సవాల్ చేస్తూ తమిళనాడు బార్ కౌన్సిల్ మెంబర్ వర్ధన్, ఇతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధనలతో దేశంలోని రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో జాప్యం జరుగుతున్నదని వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌‌ల త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏండ్ల తరబడి జాప్యం చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రారంభించాలని సూచించింది.