
న్యూఢిల్లీ, వెలుగు:విచారించే కోర్టు మారినా.. పరిధి మారదు, విషయం మారదని ‘ఓటుకు–నోటు’ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను మరో రెండు వారాలు వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, మహముద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్లు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ్ లూత్రా, మేనకా గురుస్వామి.. పిటిషన్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు ఆర్యమా సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందరం వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ద్వారా చేసిన ట్వీట్లను ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ (ఐఏ) ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇందులో న్యాయవాదులు, న్యాయమూర్తులను అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, ఆ వివరాలు అన్ని ఐఏ లో పొందుపరిచినట్లు న్యాయవాదులు పేర్కొనగా.. స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్.... ‘ఎందుకు పొలిటీషన్స్ కోర్టులు, న్యాయమూర్తులను వారి మధ్యలోకి లాగుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పరిధిలోనే హోంమంత్రి శాఖ ఉందని సుందరం మరోసారి కోర్టు దృష్టికి తెచ్చారు. ఏసీబీ, ఏసీబీ ప్రాసిక్యూషన్, అలాగే అధికారులు ఆయకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని తాము దాఖలు చేసిన రిజాయిండర్ లో సవివరంగా పొందుపరిచామన్నారు. ఏసీబీ ఎవర్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, వద్దు అనేది హోంమంత్రిత్వ శాఖనే నిర్ణయిస్తుందని వాదనలు వినిపించారు.
ఈ వాదనలపై మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘ఒకవేళ మరోచోటుకు కేసు విచారణ మార్చితే కూడా.. అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా అని ప్రశ్నించింది. అప్పుడు జ్యురిస్డిక్షన్ మారుతుందని, ప్రాసిక్యూషన్ హోంమంత్రి చేతుల్లో ఉండదని సుందరం వాదించారు. మధ్యలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకొని.. ఇప్పటికే 25 మంది సాక్షుల నుంచి అన్ని వివరాలను ఏసీబీ సేకరించిందని కోర్టుకు నివేదించారు. కాగా, మరోసారి పిటిషనర్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన ఐఏ పై స్పందిస్తూ.. ప్రభుత్వ తరఫు అడ్వొకేట్లపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు, న్యాయవాదులను ట్యాగ్ చేశారని.. దీనిపై తొలుత కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అత్యున్నత స్థానంలో ఉన్నోళ్లు బాధ్యతగా ఉండాలె
‘ల్యాండ్ గ్రాబర్స్ కు ఒక రూల్.. ప్రభుత్వానికి ఒక రూలా? వాట్ ఈజ్ దిస్ మై లార్డ్?’ అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసిన కామెంట్లను ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాత్ర లేదని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థా లూత్రా వాదించారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా ఉన్నారని, పీసీసీ అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యత ఉంటుందని సుందరం కోర్టుకు తెలిపారు.
అయితే గత శుక్రవారం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. వ్యవస్థపై తనకు ఎంత గౌరవం ఉందో కూడా సీఎం ప్రకటన చేశారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఎందుకు పొలిటీషియన్స్ కోర్టులు, న్యాయమూర్తులను మధ్యలోకి లాగుతున్నారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ గవాయి.. పిటిషనర్ దాఖలు చేసిన ఐఏపై తప్పక రిప్లే ఇవ్వాలని ఆదేశించారు. ‘ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, వాళ్లు బాధ్యతగా ఉండాలని’ అని సీఎం ను ఉద్దేశించి వ్వాఖ్యానించారు.
అంతకు ముందు జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ.. తెలంగాణలో ప్రస్తుతం భారీ వరదలు ఉన్నాయని, ఆ విధుల్లో ప్రభుత్వం నిమగ్నం అయి ఉన్నట్లు గుర్తు చేశారు. తాము అన్ని సున్నితమైన అంశాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. అందువల్ల రెండు వారాల్లో ఐఏపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. మరోసారి జస్టిస్ గవాయి జోక్యం చేసుకొని.. కానీ పొలిటిషన్స్ మాత్రం కోర్టులను, జడ్జీలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తదుపరి విచారణను రెండు వారాల తర్వాత చేపడతామని స్పష్టం చేశారు.