
- వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సుప్రీం
- జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రభుత్వ ప్లీడర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆర్టీ 354 ను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వానికి, న్యాయవాదులకు మధ్య ఉన్న ‘విశ్వాసం లేదా నమ్మకం’పై ఆధారపడి ఈ పోస్ట్ ల భర్తీ ఉంటుందని వ్యాఖ్యానించింది. వారి నియామకం, తొలగింపు పై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అయితే, వారు పనిచేసిన కాలానికి రావాల్సిన గౌరవ వేతన బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్ ను కొట్టివేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా న్యాయస్థానాల్లో గవర్నమెంట్ ప్లీడర్లు, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించారు. ఈ నియామక ప్రక్రియ సరిగా జరగలేదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని తొలగిస్తూ జీవో నెంబర్ 354 ను తీసుకువచ్చింది.
ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు ప్లీడర్లు హైకోర్టును ఆశ్రయించగా.. తొలుత సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వును సమర్థించాయి. ‘‘ప్రభుత్వాలు తమకు నచ్చిన న్యాయాధికారులను నియమించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవడం అంటే ప్రభుత్వ నిర్ణయాలకు సంకెళ్లు వేయడమే’’ అని పేర్కొంటూ సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో 27న యాండాల ప్రదీప్ తో పాటు మరో 19 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.
రెండు నెలల్లో గౌరవ వేతనాలు చెల్లించాలి
తొలగింపునకు గురైన లాయర్లు గౌరవ వేతనంపై ఆధారపడి జీవిస్తున్నారని పిటిషనర్ల తరపు అడ్వొకేట్ ధర్మాసనానికి నివేదించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం... లాయర్లు పనిచేసిన కాలానికి సంబంధించిన పూర్తి బకాయిలను రెండు నెలల్లోగా ప్రభుత్వం వారికి చెల్లించాలని ఆదేశించింది.