బీహార్ పంచాయతీరాజ్ మంత్రికి.. సుప్రీంకోర్టు నోటీసులు

బీహార్ పంచాయతీరాజ్ మంత్రికి.. సుప్రీంకోర్టు నోటీసులు

ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా  బీహార్ మంత్రిగా నియమితులైన దీపక్ ప్రకాష్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు  చేసిన పిటిషన్ నువిచారించిన సుప్రీంకోర్టు దీపక్ ప్రకాష్ కు, ఎన్నికల సంఘానికి నోటీసులిచ్చింది. శాసనసభ్యుడు కానీ వ్యక్తి రాష్ట్ర మంత్రిగా ఆరు నెలలు మాత్రమే కొనసాగవచ్చు.. రెండోసారి ఈ అవకాశం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు దీపక్ ప్రకాష్ కు ఇచ్చిన గడువు 2026 మే 20ననాటికే ముగిసింది. 

పిటిషన్ ప్రకారం..దీపక్  ప్రకాష్ శాసనసభ సభ్యుడు కానప్పటికీ, 2025 నవంబర్ 20న అప్పటి సీఎం నితీష్ కుమార్ ఆయనను మంత్రిగా నియమించారు. 2026 ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మంత్రివర్గం రద్దయింది. 22 రోజుల విరామం తర్వాత, 2026 మే 7న సీఎం సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం  ప్రకాష్ ను తిరిగి నియమించింది.మొదటి నియామకం నుంచి తిరిగి ఎన్నిక కావడానికి ఉన్న 6 నెలల పదవీకాలం 2026 మే 20న ముగిసింది.  దీంతో సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, శాసనసభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగవచ్చు.. ఆ సమయంలో అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వాన్ని పొందాలి.. ఈ మినహాయింపు ఒక్కసారి మాత్రమే ఉంటుంది.. ప్రభుత్వం మారినంత మాత్రాన దీనిని పునరుద్ధరించలేమని కోర్టు స్పష్టం చేసింది.