న్యూఢిల్లీ, వెలుగు: లైబ్రేరియన్ పోస్టుల నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఎనిమిది వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇంటర్మీడియెట్, సాంకేతిక విద్యా శాఖల్లోని 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ పోటీ పరీక్షల్లో అర్హత పొందిన పలువురు విశ్వవిద్యాలయ పరిధి బయట ఉన్న స్టడీ సెంటర్ల ద్వారా దూర విద్యలో మాస్టర్స్ చేసినట్లు తేలింది. దీంతో వారి లైబ్రరీ సైన్స్ డిగ్రీలు చెల్లవంటూ వారికి ఉద్యోగాలిచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచ్‌లో వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది.
దానిపై టీజీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లగా విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కమిషన్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. విశ్వవిద్యాలయ పరిధి వెలుపల ఉన్న అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు పొందిన దూర విద్య డిగ్రీలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గత నెల అభ్యర్థులు ఏ.విజయచంద్ర రెడ్డి, ఇతరులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియ ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. 2017 నోటిఫికేషన్ లో కొన్ని నిబంధనలు మాత్రమే మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆచార్య నాగార్జున వర్సిటీ దూర విద్య కోర్సుల చెల్లుబాటు అంశంపై వాదనలు కొనసాగించారు.
మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, అడ్వకేట్ శ్రీకాంత్ ఈ వాదనలపై అభ్యంతరం తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
