- విద్యుత్ఉద్యోగుల పంపిణీలో సుప్రీంకోర్టు కీలక ఆదేశం
- సీజేఐ అనుమతితో పాత బెంచ్‌కే పిటిషన్ బదిలీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపిణీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నిబంధనల ప్రకారం ‘స్టేట్ క్యాడర్’ ఉద్యోగులకు వర్తించే తీర్పులు, ‘జోనల్ క్యాడర్’కు వర్తించవన్న పిటిషనర్ వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ వర్సెస్ ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కేసులో భాగంగా దాఖలైన పిటిషన్లను, సీజేఐ అనుమతితో గతంలో ఈ వ్యవహారాలను విచారించిన బెంచ్‌కే బదిలీ చేయాలని రిజిస్టార్ ను ఆదేశించింది. రాష్ట్ర విభజన నిబంధనలకు విరుద్ధంగా తనను ఏపీకి కేటాయించారని వెనుతురుల మలిక అనే ఉద్యోగి ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే వెసులుబాటు కల్పిస్తూ ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. అయితే, హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో మలిక మళ్లీ సుప్రీంకోర్టులో మిస్లీనియస్ అప్లికేషన్ (ఎంఏ) దాఖలు చేసింది.
సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం. హసన్ నజ్కీ వాదనలు వినిపించారు. విభజన నిబంధనలు కేవలం స్టేట్ క్యాడర్ ఉద్యోగులకే వర్తిస్తాయని, కానీ తన క్లయింట్ జోనల్ క్యాడర్ కిందకు వస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం వీరు తెలంగాణ కేటాయింపునకే అర్హులని, ఈ అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. గతంలో ఎస్‌ఎల్‌పీ కొట్టివేసిన సమయంలోనే, భవిష్యత్తులో ఎంఏ దాఖలు చేసుకునే స్వేచ్ఛను కోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ వాదనలను పరిగణలోకి ధర్మాసనం.. విద్యుత్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ఇతర పిటిషన్లను విచారిస్తున్న బెంచ్‌కే ఈ అప్లికేషన్‌ను కూడా జత చేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అనుమతి తీసుకుని, ఈ కేసును సంబంధిత ధర్మాసనం ముందు జాబితా చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
