- అన్ని రాష్ట్రాలు, యూటీల హోం సెక్రటరీలకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ, వెలుగు: పిల్లల అక్రమ రవాణా(చైల్డ్ ట్రాఫికింగ్) అంశాన్ని తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ అంశంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య తీవ్రమైన శాంతిభద్రతల ఆందోళనలకు సంబంధించినదని, రాష్ట్ర స్థాయిలో తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పింది. చైల్డ్ ట్రాఫికింగ్ అంశంలో పింకి వర్సెస్ ఉత్తర ప్రదేశ్, ఇతరులకు సంబంధించిన పిటిషన్ పై విచారణలో భాగంగా జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ కే వీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
‘చైల్డ్ ట్రాఫికింగ్ అంశం చాలా తీవ్రమైంది. రోజు రోజుకు ఈ కేసులు పెరగడాన్ని మనం గుర్తిస్తున్నాం. అప్పుడప్పుడు పిల్లలను తిరిగి తీసుకువస్తున్నట్టు రిపోర్ట్ లు ఉన్నాయి. అంటే, ఈ సమస్య పరిష్కరించవచ్చని అర్థం. దీనికి కావాల్సింది సంకల్పం మాత్రమే. అందువల్ల చిత్తశుద్దితో పని చేయండి. మేము పర్యవేక్షిస్తూ.. అవరసమైన ఆదేశాలు జారీ చేస్తాం’ అని స్పష్టం చేసింది.
ఇదే చివరి అవకాశం..
కోర్టు గత ఉత్తర్వుల పాటించని పలు రాష్ట్రాల హోం సెక్రటరీలు ఆన్ లైన్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘చైల్డ్ ట్రాఫికింగ్ అరికట్టడంలో ఏప్రిల్ 15, 2025 నాటి తమ తీర్పులోని ఆదేశాలను పాటించని రాష్ట్రాలకు తుది అవకాశం ఇస్తున్నాం. ఈ నెల 18 లోపు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అలా కాకుండా ఆదేశాలు పాటించని, నివేదికలు దాఖలు చేయని రాష్ట్రాలను ‘డిఫాల్టింగ్ స్టేట్స్’ గా పరిగణిస్తాం అని హెచ్చరించింది. అయితే, చైల్డ్ ట్రాఫికింగ్ నేరాలపై కాల పరిమితితో కూడిన దర్యాప్తు, విచారణ జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పెండింగ్ లో ఉన్న విచారణపై సమాచారాన్ని సేకరించి.. ఆరు నెలల్లో, వీలైతే రోజువారీగా వాటిని పూర్తి చేసేలా సర్క్యూలర్ జారీ చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అయితే, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గోవాతో పాటు మొత్తం 13 రాష్ట్రాలు గత ఆదేశాల అనుసారం రివ్యూ కమిటీలను వేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చైల్డ్ ట్రాఫికింగ్ సమస్యను తేలికగా చూడడం సరికాదని వ్యాఖ్యానించింది. అందువల్ల గత ఆదేశాలను తప్పక పాటించాలని పేర్కొంటూ.. ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్ లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
