సూరరై పొట్రు హిందీ రిమేక్ లో సూర్య గెస్ట్ రోల్

సూరరై పొట్రు హిందీ రిమేక్ లో సూర్య గెస్ట్ రోల్

రెమ్యునరేషన్ ను కాకుండా... కేవలం కథను చూసి సినిమా ఓకే చేసే గొప్ప నటుల్లో తమిళ నటుడు సూర్య ముందుంటారు. తన పాత్ర ఇలా ఉంటేనే చేస్తానన్న హద్దులు పెట్టుకోకుండా.. ఏ పాత్రనైనా జీవించి చేయడంలో ఆయన దిట్ట. కథ బాగుంటే అది రెండు, మూడు నిమిషాల నిడివి ఉన్న పాత్రైనా సరే చేస్తాననే స్వభావం ఉన్న సూర్య వ్యక్తిత్వం... ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో తేటతెల్లం అయింది. ఆ మూవీలో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులో చేసింది జస్ట్ గెస్ట్ అప్పియరెన్స్ అయినా.. ఆయన నటనకు, ఆ క్యారెక్టర్ కు అభిమానులు వంద శాతం మార్కులిచ్చేశారు.

ఇకపోతే కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన సూరరై పొట్రు సినిమా అప్పట్లో వివిధ భాషల్లో విడుదలై ఎంత సక్సెస్ ను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలైంది. లాక్ డౌన్ సమయంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి తెలుగులోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక వ్యూస్ సాధించిన బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. అయితే ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోనూ రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. తాజాగా సూర్య  లొకేషన్ లో అక్షయ్ కుమార్ తో కలిసి దిగిన పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.