సరోగసి కుంభకోణం: నేను ఎలాంటి తప్పు చేయలేదు... అతని వల్లే కేసు పెట్టారు

సరోగసి కుంభకోణం: నేను ఎలాంటి తప్పు చేయలేదు... అతని వల్లే  కేసు పెట్టారు

తెలంగాణలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆగస్టు 1న  గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ నమ్రతకు  వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడిన నమ్రత..తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.  ఓ ఆర్మీ అధికారి తప్పుడు  ఆరపణలే వల్లే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. 

నకిలీ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో ప్రధాన నిందితురాలు, సృష్టి టెస్ట్ ట్యూబ్​సెంటర్​ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదో అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ జులై 31న  తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మరింత సమాచారాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమెను  అడిగే ప్రశ్నలకు సంబందించిన ప్రశ్నావళిని పోలీసులు సిద్దం చేసినట్టు సమాచారం. 

రిమాండ్ లో కీలక విషయాలు

డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నట్లు సమాచారం. సంతానం లేని దంపతులు ఐవీఎఫ్ కోసం దవాఖానకు వస్తే వారిని డాక్టర్ నమ్రత సరోగసి వైపు మళ్లించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని డాక్టర్ నమృత ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఐవీఎఫ్ కు రూ. ఒకటి..రెండు లక్షలు మాత్రమే వస్తాయని..అదే సరోగసీ అయితే రూ. 30 నుంచి రూ.40 లక్షలు వస్తాయనే దుర్బుద్ధితో  నమ్రత ఈ దారుణాలకు ఒడిగట్టారు. చాలా కేసుల్లో సరోగసీ చేయకుండానే పేద, మధ్య తరగతి దంపతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారికి ఎంతో కొంత చెల్లించి వాళ్ల పిల్లలను సంతానం లేని దంపతులకు సరోగసీ పేరుతో అంటగట్టినట్లు సమాచారం. సరోగసీ చేయకుండానే చేసినట్లుగా నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇలా రూ. కోట్లు సంపాదించింది. ఈ ప్రక్రియలో డాక్టర్ నమ్రతకు గాంధీ దవాఖాన అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం సహకరించినట్లు సమాచారం.