- బ్యాంకులు, జ్యువెలరీ షాపుల యాజమాన్యాలకు కీలక సూచనలు
- సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, వెలుగు: అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో బ్యాంకులు, జ్యువెలరీ షాపుల యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో అంతర్రాష్ట్ర ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పీఎంజే జ్యువెలర్స్‌లో ఇటీవల జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలోని వ్యాపార సంస్థలు భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఎంట్రీ, ఎగ్జిట్లను, క్యాష్ కౌంటర్లు, లాకర్ గదులు పూర్తిగా కవర్ అయ్యేలా హై రిజల్యూషన్ నైట్ విజన్ సీసీటీవీ కెమెరాలను నిరంతర విద్యుత్ బ్యాకప్‌తో ఏర్పాటు చేయాలని తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానమైన బర్గ్లర్ అలారాలు, పానిక్ బటన్లు ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు.
బ్యాంకులు, ఏటీఎంలు, వాణిజ్య సముదాయాల వద్ద బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా 24 గంటల పహారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే.. బక్రీద్ పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముగ్ధంపూర్, చింతకుంట, ఆర్నకొండ, తుర్కాసినగర్, రేణికుంట, హుజురాబాద్ పరకాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
