- మన ఇసుక-.. మన వాహనం’ అమలు కోసం సర్వే పూర్తి
- సర్వే రిపోర్ట్ కలెక్టర్ కు అందజేత
- కలెక్టర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న భద్రగిరివాసులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలో ఇసుక కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆఫీసర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సామాన్యులకు తక్కువ ధరకే అందించేందుకు 'మన ఇసుక.. వాహనం' అనే ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. ఈ యాప్/వెబ్‌సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే 48 గంటల్లోనే నేరుగా యజమాని ఇంటికే ఇసుక సరఫరా అవుతుంది. ‘మన ఇసుక.. -మన వాహనం’ అమలుకు వివిధ శాఖల ఆఫీసర్లతో భద్రాచలం ఇసుక ర్యాంపులో ఇప్పటికే సర్వే పూర్తి చేసి కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు నివేదిక అందజేశారు. కలెక్టర్ నిర్ణయం కోసం అధికారులు, పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు.
ఏండ్ల తరబడి సమస్య..
చెంతనే గోదావరి నది ఉన్నా..ఇసుకను తెచ్చుకునే భాగ్యం పట్టణవాసులకు లేకుండాపోయింది. ఇసుక సొసైటీలు ఉన్నా ర్యాంపు దక్కించుకునేందుకు నేతలు పోటీపడడం, ఒక్కో సొసైటీకి ఒక్కో ప్రజాప్రతినిధి కొమ్ముకాయడంతో ఇసుక ర్యాంపులు తెరుచుకోవడం లేదు. దీంతో ఏండ్ల తరబడి భద్రగిరివాసులు ఇసుక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలోని చర్ల, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఒక్క భద్రాచలంలోనే ర్యాంపు నడవడం లేదు. దీని అక్రమార్కులు ఆసరాగా చేసుకొని రాత్రి వేళల్లో ట్రాక్టర్లను ర్యాంపులోకి దించి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఏకంగా ట్రక్కు ఇసుకను రూ.5 వేలకు అమ్ముతున్నారు. దీనితో భవన నిర్మాణం భారంగా మారింది. మామూళ్ల మత్తులో అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్కువ ధరకు ఇసుక అందించేందుకు...
భద్రాచలం పట్టణ ప్రజలకు తక్కువ ధరకే ఇసుకను అందించాలని స్థానిక తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఇటీవల అన్ని శాఖల ఆఫీసర్లు ర్యాంపులో సర్వే నిర్వహించారు. ‘మన ఇసుక.. -మన వాహనం’ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుకను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రక్కు ఇసుకను రూ.3 వేలకు అందించడం ద్వారా అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా చర్యలు తీసుకున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం..
భద్రాచలం పట్టణ ప్రజల ఇసుక సమస్యను పరిష్కరిస్తాం. సర్వే చేసి కలెక్టర్‌కు నివేదిక పంపించాం. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే ప్రజలకు ‘మన ఇసుక..-మన వాహనం’ ద్వారా ఇసుకను అందిస్తాం. దీంతో ప్రజల సమస్య తీరుతుంది.. అక్రమార్కులకు కళ్లెం పడుతుంది. ధనియాల వెంకటేశ్వర్లు, తహసీల్దార్
