Asia Cup 2025: మ్యాచ్ మాత్రమే ఆడండి.. సూర్యతో పాటు ఇద్దరు పాక్ క్రికెటర్లపై ఐసీసీ కొరడా

Asia Cup 2025: మ్యాచ్ మాత్రమే ఆడండి.. సూర్యతో పాటు ఇద్దరు పాక్ క్రికెటర్లపై ఐసీసీ కొరడా

ఆసియాకప్ 2025 లో ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనే వివాదాలు చోటు చేసుకున్నాయి. దాయాధి జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగితే రెండు మ్యాచ్ ల్లోనూ ఎవరూ తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తించారు. హ్యాండ్ షేక్ వివాదంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత ఇరు దేశాల అంతర్గత కలహాలలో జోక్యం చేసుకునే వరకు వెళ్ళింది. మ్యాచ్ సంగతి మర్చిపోయిన ఇరు జట్ల ఆటగాళ్లు దేశాల మధ్య ప్రతీకారాన్ని గుర్తు చేశారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్' ఎటాక్ కు గురైన బాధితుల గురించి మాట్లాడితే ఫర్హాన్, రౌఫ్ తమ సైగలతో ఓవరాక్షన్ చేశారు. 

సూర్యపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేస్తే.. ఫర్హాన్, రౌఫ్ లపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 26) వీరి ముగ్గురిపై ఐసీసీ విచారణ జరిపింది. గురువారం, శుక్రవారం ఐసీసీ మ్యాచ్ రిఫరీల పర్యవేక్షణలో క్రమశిక్షణా విచారణలు నిర్వహించింది.   రెండు జట్ల మేనేజర్లు కూడా సమావేశాలకు హాజరయ్యారు. సూర్యకుమార్ యాదవ్, హరిస్ రౌఫ్ ల ప్రవర్తనకు ఐసీసీ హెచ్చరించి వీరిద్దరి మ్యాచ్ ఫీజ్ లో 30 శాతం జరిమానా విధించారు. మరోవైపు పాకిస్తాన్‌ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ జరిమానా నుండి తప్పించుకున్నాడు. అతను చేసిన గన్ సెలెబ్రేషన్ కు వార్నింగ్ ఇచ్చి సరిపెట్టారు. 

పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత సూర్య ఏమన్నాడంటే..?
 
ఆసియా కప్ లో పాకిస్థాన్ పై లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఇండియా అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్య మాట్లాడుతూ.. ఇలా అన్నాడు. "పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు మేము అండగా నిలుస్తున్నాము . మా సంఘీభావం తెలియజేస్తున్నాము. పాకిస్థాన్ పై ఈ విజయాన్ని మన సాయుధ దళాలన్నింటికీ అంకితం చేయాలనుకుంటున్నాము. వారు  ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాము." అని పాకిస్తాన్‌పై విజయం తర్వాత సూర్య అన్నాడు. 

ఫీల్డింగ్ చేస్తూ రౌఫ్ వక్రబుద్ధి:

ఆదివారం (సెప్టెంబర్ 21) సూపర్-4లో భాగంగా ఇండియా ఛేజింగ్ చేస్తున్నప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. స్టేడియంలో టీమిండియా ఫ్యాన్స్ 2022 టీ20 వరల్డ్ కప్ లో రౌఫ్ బౌలింగ్ విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు ఈ పాక్ పేసర్ కు  గుర్తు చేశారు. ఆ తర్వాత రౌఫ్ సంజ్ఞలు వివాదాస్పదంగా మారాయి. ఒక ఫైటర్‌ జెట్‌ గాల్లో ఎగురుతూ, సడెన్‌గా కూలిపోయినట్లు యాక్షన్‌ చేశాడు. భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సైగలు చేశాడు. అంతకు ముందు విమానాన్ని కూల్చేసినట్లు కూడా సైగలు చేశాడు. రౌఫ్ సైగలు మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ సెలెబ్రేషన్: 

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ వైరల్ గా మారింది. ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్  చేసిన ఈ పాక్ ఓపెనర్ హాఫ్ సెంచరీ తర్వాత ఓవరాక్షన్ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్‌ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఫర్హాన్ తన బ్యాట్ ను గన్ లా చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు.