సూర్యాపేట క్రైమ్, వెలుగు: సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలంలో 2019లో జరిగిన బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు పారపంగి అలెందర్‌కు 33 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జ్ జడ్జి డాక్టర్ పి. శివరాం ప్రసాద్ సంచలన తీర్పునిచ్చినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.
మాయమాటలతో బాలికను లోబర్చుకున్న నిందితుడిపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్ఎస్ఎల్ నివేదిక, పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది రఘురామయ్య వాదనలు వినిపించగా, నేరం నిరూపితం కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసిందన్నారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
