- స్టూడెంట్స్‌ను ప్రైవేటు స్కూళ్లకు పంపిన పంతుళ్లు
- ఐదుగురిని సస్పెండ్ చేసిన విద్యా శాఖ
తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ హైస్కూల్‌లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడానికి టీచర్ల మధ్య విభేదాలే కారణమని తేలింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీ హైస్కూల్ హెచ్ఎంతో పాటు మరో నలుగురు టీచర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
స్కూల్లో కొంతకాలంగా ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగడంతో విద్యాబోధన దెబ్బతింది. ఫలితంగా హైస్కూల్ విభాగంలో ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ స్కూల్లో సౌకర్యాలు లేవని, బోధన సరిగా ఉండదని విద్యార్థులు, తల్లిదండ్రులకు చెబుతూ వారిని ప్రైవేట్ స్కూళ్లలో చేరాలని టీచర్లే ప్రోత్సహించినట్లు అధికారుల విచారణలో తేలింది.
స్టాఫ్ మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తొలుత ఈ నెల 15న హెచ్ఎం ఎం.ఏ.హకీమ్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం శనివారం స్కూల్ అసిస్టెంట్లు పి.కోటయ్య, కె.సుజాత, జి.గీత, ఎస్జీటీ కె.శ్రీనివాసనాయుడును కూడా సస్పెండ్ చేస్తూ డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని డీఈవో తెలిపారు.
