మిగిలిన 15 సీట్లపై ఉత్కంఠ.. అభ్యర్థుల ఎంపికను హైకమాండ్‌‌‌‌కే వదిలేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

మిగిలిన 15 సీట్లపై ఉత్కంఠ.. అభ్యర్థుల ఎంపికను హైకమాండ్‌‌‌‌కే వదిలేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ
  • తమ అనుచరులకే కేటాయించాలంటూ లీడర్ల ఒత్తిడి నేపథ్యంలో నిర్ణయం
  • ఇక స్క్రీనింగ్ కమిటీ, సీఈసీ భేటీలు ఉండవు: మురళీధరన్
  • అభ్యర్థుల ఫైనల్ లిస్టుపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ: మాణిక్ రావ్ ఠాక్రే

న్యూఢిల్లీ, వెలుగు: రెండు విడతల్లో 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. నాలుగు సీట్లు కమ్యూనిస్టులకు పోను మిగిలిన 15 సీట్ల విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సీట్లను ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెండింగ్ స్థానాల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, తమ అనుచరులకే సీట్లు కేటాయించాని ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చేతులెత్తేసింది. వాటిపై నిర్ణయాధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకే వదిలేసింది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయాన్ని అధిష్టానమే చూసుకుంటుందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. శుక్రవారం పలువురి జాయినింగ్స్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ లిస్టులో 55 సీట్లకు, సెకండ్ లిస్టులో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు చెప్పారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ చీఫ్‌‌‌‌కు వదిలేశామని వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘సీపీఐ, సీపీఎంలకు చేరో రెండు సీట్లు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అయితే ఏయే స్థానాలు ఇవ్వాలన్న అంశంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది’’ అని తెలిపారు.

సుదీర్ఘ చర్చ

అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ హెడ్ ఆఫీసులో జరిగిన ఈ మీటింగ్‌‌‌‌కు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌‌‌‌తో సహా మొత్తం 12 మంది హాజరయ్యారు. ఇందులో సెకండ్ లిస్టుకు సంబంధించి స్ర్కీనింగ్ కమిటీ సూచించిన అభ్యర్థులపై చర్చించారు. ఇందులో 45 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. అలాగే లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే నాలుగు స్థానాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం కేటాయించాలని, సీపీఎంకు మిర్యాలగూడతో పాటు ఖమ్మంలో ఒక స్థానాన్ని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు తీవ్ర పోటీ, మరిన్ని జాయినింగ్స్ ఉండే స్థానాలు, రాష్ట్ర నేతలు తమ అనుచరులకు కేటాయించాలని పట్టుబడుతున్న సీట్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇలా మొత్తం 15 సీట్లలో చిక్కుముడి నెలకొంది. రాష్ట్రంలో అగ్ర నేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక పర్యటనల నేపథ్యంలో ఈ 15 స్థానాలను పెండింగ్ లో పెట్టాలని ఫైనల్ గా నిర్ణయించారని తెలుస్తున్నది.

అన్ని వర్గాలకు ప్రాధాన్యం: ఠాక్రే

అభ్యర్థుల ఫైనల్ లిస్ట్, లెఫ్ట్ పార్టీలతో పొత్తుల అంశం ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. దాదాపు అన్ని సీట్లపై శుక్రవారం జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీలో చర్చ జరిగిందన్నారు. తొలి జాబితాపై ఎవరూ అసంతృప్తిగా లేరని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మిగతా సీట్లపై తేల్చేందుకు మరోసారి సీఈసీ భేటీ ఉండదని తేల్చిచెప్పారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, లెఫ్ట్ పార్టీలతో భట్టి, వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు.