గత సర్కారు హయాంలో ఈఆర్సీ అనుమతులు లేకుండానే విద్యుత్ ఒప్పందాలు
పర్యావరణ శాఖ ఆదేశాలకు విరుద్ధంగా భద్రాద్రిలో
సబ్ క్రిటికల్ ప్లాంట్ల ఏర్పాటు
ఈ అక్రమాలతో రాష్ట్రంపై
వేల కోట్ల భారం పడినట్టు
తేల్చిన కమిషన్?
ఈ నివేదిక ఆధారంగానే
తాజాగా సీబీఐ దర్యాప్తుకు
రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు
తాజా విజ్ఞప్తి విషయంలో
కేంద్రం స్పందనపై ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: గత సర్కారు హయాంలో చత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. నాటి పాలకుల నిర్ణయాల వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదించే దిశగా కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జస్టిస్ బి లోకూర్ కమిషన్ రాష్ట్ర సర్కారుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ ఎంక్వైరీకి అనుమతిస్తూ సోమవారం కేబినెట్లో నిర్ణయం తీసుకోగా, ఎంక్వైరీకి అనుమతిస్తూ మంగళవారమే ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించగా, విద్యుత్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు తప్పనిసరిగా అవసరమనే అంశాలను స్పష్టంగా ప్రత్యేకంగా జీవోలో పేర్కొనాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
దీంతో ఆ మేరకు ఆర్డర్ కాపీని సిద్ధం చేసి బుధవారం సీబీఐకు పంపనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా విద్యుత్అక్రమాలపైనా సీబీఐ ఎంక్వైరీ కోరడంతో ఈ రెండు బంతులను కేంద్రం కోర్టులోకి నెట్టినట్టయ్యింది. కాళేశ్వరం సీబీఐ దర్యాప్తుపై కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేని తరుణంలో..‘విద్యుత్’ దర్యాప్తుపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
సీబీఐ దర్యాప్తు అవసరం ఉందనే అంశాలతో అనుమతి కోరుతున్న రాష్ట్ర సర్కార్..
కాళేశ్వరం కమిషన్నివేదిక బయటకు వచ్చినప్పటికీ విద్యుత్ కమిషన్రిపోర్ట్ను ప్రభుత్వం ఇంతవరకు బయటపెట్టలేదు. జస్టిస్ నరసింహారెడ్డి, ఆ తర్వాత బి లోకూర్ కమిషన్ సేకరించిన కీలక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం నాటి అక్రమాల్లో ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.
విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి లేకుండానే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలకు విరుద్ధంగా కాలం చెల్లిన సాంకేతికతతో భద్రాద్రి ప్లాంట్ఏర్పాటుచేయడం లాంటి అంతర్రాష్ట్ర అంశాలు ఈ కేసులో ఉన్నందున సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించడమే సరైనదని రేవంత్ సర్కారు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితమే సీబీఐ దర్యాప్తు కోరింది. కానీ, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాళేశ్వరంపై విచారణను పెండింగ్‌లో పెట్టిన కేంద్రం, ఇప్పుడు విద్యుత్ రంగ అక్రమాలపై ఏ మేరకు కదులుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
అడ్డగోలు ఒప్పందాలతో వేల కోట్ల భారం..
విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ కొనుగోలుకు తప్పనిసరిగా 'కాంపిటేటివ్ బిడ్డింగ్' (టెండర్లు) నిర్వహించాలి. కానీ, చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఎటువంటి టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని విచారణ కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. మార్కెట్ ధర కంటే ఎక్కువరేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని ప్రాథమికంగా నిర్ధారించింది. అప్పటి ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై.. ‘పైస్థాయి ఒత్తిడి వల్లే నిబంధనలు పక్కన పెట్టి సంతకాలు చేయాల్సి వచ్చింది’ అని వాంగ్మూలం ఇచ్చినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు సమాచారం.
కేంద్ర పర్యావరణ శాఖ అప్పటికే 'సబ్ క్రిటికల్' సాంకేతికతను వాడకూడదని స్పష్టం చేసినా.. భద్రాద్రి ప్లాంట్ కోసం అదే పాత టెక్నాలజీని ఎంచుకున్నారని, ఇందుకు అనుమతులు రాకపోవడంతో, ప్లాంట్ నిర్మాణాన్ని ఆలస్యం చేశారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. కేవలం ఒక ప్రైవేట్ సంస్థ (బెల్ద్వారా పని చేసే సబ్ కాంట్రాక్టర్)కు లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని విచారణలో తేలినట్టు సమాచారం.
యాదాద్రి (దామరచర్ల) ప్లాంట్‌ను బొగ్గు గనులకు దూరంగా నిర్మించడం వల్ల, బొగ్గు రవాణా కోసమే ప్రతి ఏటా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచినట్టు కమిషన్తేల్చింది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి లేకుండానే కొన్ని ఒప్పందాలు ముందుకు సాగాయని కమిషన్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల వల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడిందని కమిషన్ నిర్ధారించినట్టు సమాచారం.
