హైదరాబాద్ సిటీ, వెలుగు: తమను రాంకీ సంస్థ పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్ చేస్తూ వందలాది మంది స్వచ్ఛ ఆటో కార్మికులు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఆఫీసులోకి వస్తూనే ‘రాంకీ గో బ్యాక్, జీహెచ్ఎంసీ ముద్దు, రాంకీ వద్దు’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు తమను లోపలికి అనుమతించకపోవడంతో కార్మికులు రోడ్డుపైనే నిరసన తెలపగా, లిబర్టీ నుంచి సచివాలయం వైపు వెళ్లే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
ఒంటి గంటకు మొదలైన కార్మికుల ధర్నా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తమకు వేతనాలతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా ‘డోర్ టు డోర్’ చెత్త సేకరణ కార్మికులుగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను అంబేడ్కర్ విగ్రహం ముందు నుంచి సచివాలయం వైపు మళ్లించారు.
కార్మిక నేతలతో ట్రై కమిషనర్ల సమావేశం
అనంతరం స్వచ్ఛ ఆటో కార్మిక సంఘాల నేతలతో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఆర్వీ కర్ణన్, జి. సృజన, టీ వినయ్ కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రై కార్పొరేషన్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికులు పూర్తి సహకారం అందించాలని కోరారు. చెత్త అన్లోడింగ్ సమయంలో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గిస్తామని, అవసరమైన చోట పోర్టబుల్ ట్రాన్స్ఫర్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్మికుల భద్రతకు ఎక్స్‌గ్రేసియా, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, స్వచ్ఛ ఆటో ఈఎంఐ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యంలో ట్రై-కార్పొరేషన్లను ఆదర్శంగా నిలపాలని, విధులకు హాజరు కాలేని పక్షంలో ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, రవి కిరణ్, యాదగిరి రావు, సీఎంఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
