BBL 2026: ఒకే జట్టులో స్మిత్, బాబర్ అజామ్.. బిగ్ బాష్ లీగ్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఎంట్రీ

BBL 2026: ఒకే జట్టులో స్మిత్, బాబర్ అజామ్.. బిగ్ బాష్ లీగ్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఎంట్రీ

పాకిస్థాన్ మాజీ కెప్టెన్.. టీ20 క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ బాబర్ అజామ్ ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ బాబర్ అజామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శుక్రవారం (జూన్ 13) అధికారికంగా ప్రకటించింది. రాబోయే బిగ్ బాష్ లీగ్ 2026 సీజన్ కోసం బాబర్ సిడ్నీ సిక్సర్స్ తరపున ప్రీ-డ్రాఫ్ట్ ఒప్పందం చేసుకున్నాడు. బాబర్ అజామ్ కు ఇదే తొలి బిగ్ బాష్ లీగ్ కావడం విశేషం. పాకిస్థాన్ జట్టు తరపున టీ20 ఫార్మాట్ లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ నెలకొల్పిన బాబర్ సిడ్నీ సిక్సర్స్ లో చేరడం తమకు కలిసి వస్తుందని ఆ జట్టు ఫ్రాంచైజీ తెలిపాడు.

బాబర్ అజామ్ మాట్లాడుతూ.. "ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌ల్లో ఒకటైన బిగ్ బాష్ లీగ్ లో ఆడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం. జట్టు విజయానికి తోడ్పడటానికి, అభిమానులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను". అని బాబర్ అన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా సిడ్నీ సిక్సర్స్ జట్టులో ఉండడం విశేషం. వీరిద్దరూ కలిస్ ఆడితే ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఖాయం. ఇదే జట్టులో బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్ లతో పాటు బెన్ డ్వార్షుయిస్, మోయిసెస్ హెన్రిక్స్, సీన్ అబాట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. 


టీ20 క్రికెట్‌లో బాబర్ గణాంకాలు:
 
బాబర్ అజామ్‌కు టీ20 క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్ లో ఇప్పటివరకు 320 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ మాజీ కెప్టెన్ 43.07 సగటుతో 11330 పరుగులు సాధించాడు. అంతర్జాతీ కెరీర్ విషయానికి వస్తే 128 టీ20 మ్యాచ్ ల్లో 4223 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలు.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు బాబర్ అజామ్ పాకిస్తాన్ అండర్ 19, సిల్హెట్ రాయల్స్, పాకిస్తాన్, పాకిస్తాన్ ఏ, ఇస్లామాబాద్ యునైటెడ్, రంగ్‌పూర్ రైడర్స్, కరాచీ కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, సిల్హెట్ సిక్సర్స్, సోమర్‌సెట్, డబ్లిన్ చీఫ్స్, టీమ్ వైట్, టీమ్ గ్రీన్, పెషావర్ జల్మి, కొలంబో స్ట్రైకర్స్ జట్ల తరపున ఆడాడు.