తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ కథ ఖతమైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని, నీళ్లు, నిధుల దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని.. ప్రజాక్షేత్రంలో ప్రజలంతా కాంగ్రెస్ పాలనను సమర్థిస్తున్నారని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఎల్.ఎ (BLA)ల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నేత జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
►ALSO READ | సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..
అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 70 శాతం వాగ్దానాలను నెరవేర్చిందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. మళ్లీ మాదే గెలుపు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ. 23 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.
దేశవ్యాప్తంగా మహిళల అభ్యున్నతి, పేదవారి సంక్షేమమే ధ్యేయంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని, కార్యకర్తలంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సదస్సు ద్వారా పిలుపునిచ్చారు.
