
- రిజర్వేషన్లపై కేంద్రంపై నెపం మోపేందుకు సర్కారు కుట్ర
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ డ్రామాలు ఆడేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీ బిల్లును హడావుడిగా పాస్ చేసి కేంద్రానికి పంపారని, ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. కులగణనను ప్రభుత్వం శాస్త్రీయంగా చేయలేదని అన్నారు. 8న కరీంనగర్‌లో బీసీ రిజర్వేషన్లపై భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లోనూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి డిమాండ్ చేశారు.
బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీసీలకు సీఎం పదవి చేపట్టే అవకాశం వచ్చినా కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. బీసీలను ప్రభుత్వం అణగదొక్కుతుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు.