సికింద్రాబాద్ను కాపాడే పోరాటం ఆగదు

సికింద్రాబాద్ను కాపాడే పోరాటం ఆగదు
  • ఫిబ్రవరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తం  
  • అవసరమైతే బంద్‌‌కు కూడా సిద్ధం
  • తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని మాజీ మంత్రి, సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్​పల్లిలోని తన క్యాంప్ ఆఫీస్​లో బీఆర్‌‌ఎస్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 220 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.

ఈ నెల 17న శాంతి ర్యాలీకి పోలీసులు తొలుత అనుమతి ఇచ్చి, ఆ తర్వాత ర్యాలీకి కొన్ని గంటల ముందు అర్ధరాత్రి వాట్సాప్​లో అనుమతి రద్దు చేసినట్లు సమాచారం పంపడం అన్యాయమని విమర్శించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు aఅడ్డుకుని భయానక వాతావరణం సృష్టించారన్నారు. అయినప్పటికీ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు, సంఘాల ప్రతినిధులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది పాల్గొనడం అభినందనీయమన్నారు.

అరెస్టయిన వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.  ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరి మొదటి వారంలో రెట్టింపు ఉత్సాహంతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, దానికి న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే సికింద్రాబాద్ బంద్​కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు టి. మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.