రేపట్నుంచి రేషన్ షాపుల్లో టమాటాలు .. కిలో రూ.60

రేపట్నుంచి రేషన్ షాపుల్లో టమాటాలు .. కిలో రూ.60

గత కొద్ది రోజులుగా  దేశవ్యాప్తంగా టమాటా ధరలు  భారీగా పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం వరకు రూ.40కి అమ్ముడైన టమాటా ధర .. గత వారం రూ.70కి దూసుకెళ్లింది. ధర మరింత పెరిగి రూ.90 నుంచి రూ.100 వరకు చేరుకుంది.  ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల రూ.120 నుంచి 160 వరకు అమ్ముతున్నారు.  ఈ క్రమంలో తమిళనాడు  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  

టమాటా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే టమాటాలను 2023 జూలై 4 నుంచి  రేషన్ షాపుల్లో రూ. 60కే అమ్మనున్నట్లుగా పేర్కొంది.  పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ చెన్నై, సెంట్రల్ చెన్నైగా విభజించి మొత్తం 82 రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాటాలను అమ్మనున్నట్లుగా మంత్రి కేఆర్ పెరియకురుప్పన్  వెల్లడించారు.  త్వరలో ఇతర జిల్లాలకు కూడా దీనిని విస్తరిస్తామన్నారు. 

వినియోగదారులు, రైతులు నష్టపోకుండా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పెరియకురుప్పన్ . దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగాయని, రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేసి మార్కెట్ ధరలో సగానికే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  టమాటా ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లను పెంచిందని మంత్రి పేర్కొన్నారు.  

ALSO READ:పెంపుడు కుక్కతో తిరుమలకు వెళ్లకూడదా.. వెళితే ఏమౌతుంది

రాష్ట్రంలో రైతుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పెరియకురుప్పన్ వెల్లడించారు. మరోవైపు   చెన్నైలోని ప్రధాన మార్కెట్ అయిన కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి కూడా రికార్డు స్థాయికి చేరుకుంది.  ప్రస్తుతం కోయంబేడు మార్కెట్‌లో పచ్చిమిర్చి నిల్వలు భారీగా తగ్గడంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.