మంత్రి బాలాజీ బర్తరఫ్ పై వెనక్కి తగ్గిన గవర్నర్

మంత్రి బాలాజీ బర్తరఫ్ పై వెనక్కి తగ్గిన  గవర్నర్

తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయంలో గవర్నర్  ఎన్‌ రవి వెనక్కి తగ్గారు. బర్తరఫ్ ప్రకటన చేసిన కాసేపటికే అటార్నీ జనరల్ న్యాయసలహా తీసుకుంటానని తొలిగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లుగా తొలిగింపు ఉత్తర్వులను నిలుపుదల చేశామని రాజ్ భవన్  వర్గాలు వెల్లడించాయి.  బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగా కొనసాగుతారని కూడా రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ కు తెలియజేశామని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. 

కాగా 2023 జూన్  14న బాలజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆయన నివాసంతో పాటుగా కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ జరిపి ఆ తరువాత అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్‌ ఏఆర్‌ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్‌ బాలాజీకి బైపాస్‌ సర్జరీ చేశారు. 

బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి  దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 

2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్‌ హోదా లభించలేదు.