- బెంగాల్‌లో ఈస్ట్ కోస్ట్
- ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు
- టూరిజం హబ్.. ఫ్రైట్ కారిడార్ ..హైస్పీడ్ రైలు
- తమిళనాడు, కేరళ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్
- కేరళ, తమిళనాడు రైతుల కోసం ‘కొబ్బరి ప్రమోషన్ స్కీమ్’
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై కేంద్రం 2026–27 బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేలా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రత్యేక కారిడార్లను ప్రకటించారు. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న టీఎంసీని ఢీకొట్టడమే లక్ష్యంగా బెంగాల్‌కు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
దుర్గాపూర్ కేంద్రంగా ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ను ప్రతిపాదించారు. బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి బెంగాల్‌ను ‘పూర్వోదయ’ పర్యాటక రాష్ట్రంగా మారుస్తూ ఐదు ప్రధాన పర్యాటక కేంద్రాలను ప్రకటించారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బెంగాల్‌లోని డాంకుణి వరకు ‘ఫ్రైట్కారిడార్’ ఏర్పాటు చేయనున్నారు. ఇది తూర్పు- భారత్‌ను ఆర్థికంగా అనుసంధానిస్తుంది. అలాగే, బెంగాల్ కనెక్టివిటీని పెంచేలా వారణాసి–సిలిగురి వరకు కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ప్రకటించారు.
అస్సాంకు ఆధ్యాత్మికత, ఆరోగ్యం
అస్సాంకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించింది. ఆధ్యాత్మిక పర్యాటకం, ఉన్నత స్థాయి వైద్య సదుపాయాలు, వ్యవసాయ రంగం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను కలిపి ‘బౌద్ధ సర్క్యూట్’ అభివృద్ధి పథకంలో చేర్చారు. ఈ స్కీమ్ కింద పురాతన బౌద్ధ దేవాలయాలు, మఠాల పరిరక్షణ చేపడతారు.
యాత్రికుల కోసం ప్రత్యేక ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు యాత్రికుల కోసం ఆధునిక సౌకర్యాలను కల్పిస్తారు. ఈ రాష్ట్రంలోని ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం తేజ్‌పూర్‌లోని నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను ‘రీజినల్ అపెక్స్ ఇన్‌స్టిట్యూషన్’ గా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఈశాన్య భారత్ మొత్తానికి అత్యాధునిక మానసిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అస్సాంలాంటి రాష్ట్రాల కోసం కేంద్రం ప్రత్యేక పంటల అభివృద్ధి పథకాలను ప్రకటించింది.
తమిళనాడు, కేరళకు రేర్ ఎర్త్కారిడార్స్
దక్షిణాదిలో బలపడేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తమిళనాడు, కేరళ రాష్ట్రాల కోసం వినూత్న ప్రాజెక్టులను ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాల నిక్షేపాలను వెలికితీయడం నుంచి అత్యాధునిక రవాణా సౌకర్యాల వరకు ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. తమిళనాడు, కేరళ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధనల కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కేరళ, తమిళనాడులోని కోట్లాది మంది కొబ్బరి రైతుల కోసం ‘కొబ్బరి ప్రమోషన్ స్కీమ్’ను ప్రకటించారు. పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు నిధులు కేటాయించనున్నారు. అలాగే, తమిళనాడు కనెక్టివిటీని మార్చేలా రెండు కీలక హైస్పీడ్ రైల్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్–-చెన్నై, చెన్నై–-బెంగళూరు మధ్య రెండు హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి ఆదిచ్చనల్లూరును సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు, పులికాట్ సరస్సు వద్ద పక్షి సంరక్షణ కేంద్రాలు, పొదిగై మలైలో ట్రెకింగ్ పాయింట్లను డెవలప్ చేయాలని ప్రతిపాదించారు.
