హైదరాబాద్, వెలుగు: ‘అక్టోబర్ విప్లవం’ సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. దోపిడీ, పీడనలేని సమాజం సాధ్యమేనని చూపెట్టిన మహోత్తర పోరాటమని కొనియాడారు. అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం (ఎంబీ భవన్)లో ‘అక్టోబర్ విప్లవం- విశిష్టత’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. లెనిన్ నేతృత్వంలోని బోల్షివిక్ పార్టీ, బూర్జువాలు కలిసి రష్యాలో జార్ చక్రవర్తుల పాలనను కూలదోసి ఫిబ్రవరి 17న ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఆశించిన విధంగా యుద్ధాల నుంచి విముక్తి, రైతులకు భూమి, అందరికీ రేషన్ అందించేందుకు బూర్జువాలు సిద్ధంగా లేకపోవడంతో ప్రజల సహకారంతో అక్టోబర్ విప్లవం ద్వారా లెనిన్ నాయకత్వంలో రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ పని అయిపోయిందని పెట్టుబడిదారి దేశాలు సంతోషపడుతున్న సమయంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్టు వ్యవస్థ ప్రపంచం ముందుకు బలంగా వచ్చిందన్నారు.
