ఆక్రమణల పని పడుతున్న ఈగల్స్... ట్రాన్స్ జెండర్లతో కొనసాగుతున్న హైడ్రా టీమ్

ఆక్రమణల పని పడుతున్న ఈగల్స్... ట్రాన్స్ జెండర్లతో కొనసాగుతున్న హైడ్రా టీమ్
  • డీఆర్ఎఫ్​తో కలిసి కబ్జాలపై ఉక్కుపాదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణల తొలగింపులో ‘హైడ్రా ఈగల్​టీమ్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) టీమ్స్​తో కలిసి పనిచేస్తున్న ఈగల్ టీమ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం హైడ్రా ఈగల్ టీమ్స్​లో 16 మంది ట్రాన్స్​జెండర్లు పనిచేస్తుండడమే దీనికి కారణం. వీరిలో 11 మంది ట్రాన్స్ ఉమెన్ కాగా, మరో ఐదుగురు ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. 

ఆక్రమణల గుర్తింపు, కూల్చివేతల టైంలో భద్రతా చర్యల విషయంలో  డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి వీరు పనిచేస్తున్నారు. వీరి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో భవిష్యత్తులో మరింత మంది ట్రాన్స్​జెండర్లను ఈగల్ టీమ్స్‌‌‌‌లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 

ఆ రెండు ఆపరేషన్లలో...

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్​లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు ఇటీవల మాదాపూర్ లోని ఈదులకుంటను కాపాడడంలోనూ ట్రాన్స్ జెండర్లు కీలక పాత్ర పోషించారు. అడ్డు వస్తున్నవారికి నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితి వివరించి చెప్పడం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. 

గౌరవంగా ఉంది...

ఇంతకుముందుకు ఇప్పటికీ నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. హైడ్రా యూనిఫాం వేసుకుని డ్యూటీకి వెళ్తే అందరూ గౌరవంగా చూస్తున్నారు. అవకాశమిస్తే ట్రాన్స్ జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారనడానికి మా ఈగల్​టీమ్​లో పని చేస్తున్న వారే పెద్ద ఉదాహరణ. హైడ్రాలో అధికారులతో పాటు  ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. ఎలాంటి వివక్ష చూపట్లేదు.   –గాయత్రి 

మేము సైతం... 

ప్రకృతిని రక్షించడంలో మేము భాగస్వామ్యమయ్యాం. పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఆ సంస్థలో మేము భాగస్వాములము కావడం సంతోషం.. సమాజంలో తలెత్తుకుని ఉద్యోగం చేస్తున్నా..  –రుచిత