టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి: తపస్ డిమాండ్ 

టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి: తపస్ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరింది. శనివారం తపస్ స్టేట్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి హన్మంత్ రావు మీడియాతో మాట్లాడారు.

సుప్రీంకోర్టు తీర్పుతో  తెలంగాణలో 30 వేల మంది టీచర్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1, 2010 కంటే ముందు నియామకమైన టీచర్లకు టెట్ అవసరం లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉందని వారు గుర్తు చేశారు.

భాషా పండితులు, సబ్జెక్ట్ టీచర్లు తమ బోధనకు సంబంధం లేని అంశాలపై పరీక్ష రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీచర్లు ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో దీక్ష, నిష్ఠ వంటి అనేక ఆన్‌‌‌‌లైన్ శిక్షణలు పొందుతూ సమకాలీన అంశాలపై పట్టు సాధిస్తున్నారని నేతలు తెలిపారు.