హైదరాబాద్లో జోరుగా కల్తీ అల్లం వెల్లుల్లి దందా సాగుతోంది. వంటకాల్లో తప్పనిసరిగా వాడుకునే అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఓపక్క హైదరాబాద్ లో ఫుడ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ల రైడ్స్ జరుగుతున్నప్పటికీ ఆహారపదార్థాలను కల్తీ చేస్తూ దండుకుంటున్నారు కల్తీగాళ్లు. డిమాండ్ ఉన్న వస్తువుకావడంతో పెద్ద ఎత్తున నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) వికారాబాద్ జిల్లా తాండూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది.
తాండూరులోని మణికంఠ కిరాణా షాపులో 30 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షాపు యజమాని వీరన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కి చెందిన సలీం దగ్గర సరుకు సప్లై అవుతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు.
ఈ క్రమంలో సలీం ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి 166 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపు యజమాని వీరన్న దగ్గర నుంచి 30 కిలోలు, సలీం దగ్గర నుంచి 166 కిలోలు మొత్తం 196 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
వీరన్న,ఇమ్రాన్ సలీంలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ ఇటీవల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టుబడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. తరచూ పట్టుబడుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి వార్తలు వింటుంటే బయట షాపుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు జనం.
