టాటా సూపర్ ​యాప్ కోసం రంగంలోకి పెద్దోళ్లు

టాటా సూపర్ ​యాప్ కోసం రంగంలోకి పెద్దోళ్లు
  • యాప్​పై మస్తు కంప్లైంట్లు
  • సమస్యల పరిష్కారంపై ఫోకస్​
  • భారీ ఎత్తున ఫ్రొఫెషనల్స్​ నియామకం

న్యూఢిల్లీ: తన గ్రూపులోని అన్ని కంపెనీ సేవలను ఒకేచోట ఉపయోగించుకోవడానికి టాటా ‘న్యూ’ పేరుతో సూపర్​ యాప్ తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడింది. టెక్నికల్​ సమస్యల కారణంగా లాంచ్​ తేదీలు చాలాసార్లు వాయిదాపడ్డాయి. చివరికి ఈ నెల ఏడున జనానికి అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు మాత్రం దీనిపై పెదవి విరిచారు. సెర్చింజన్​ చాలా నెమ్మదిగా పనిచేస్తున్నదని, రెస్పాన్స్​ త్వరగా రావడం లేదంటూ కంప్లైంట్లు చేస్తున్నారు. మొదటి రోజే ‘న్యూ’ను ఐదు లక్షల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు.

ఇక దీనిని కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి టాటా గ్రూపు అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టింది.  అమెజాన్​, పేటీఎం, రిలయన్స్​లకు ​ఇప్పటికే సూపర్ యాప్‌‌‌‌లు ఉన్నాయి. వీటి నుండి గట్టి పోటీ, టెక్నికల్​ మధ్య - టాటా న్యూ యాప్ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. భారీగా ఆర్డర్లను రాబట్టుకోవడానికి   సీనియర్ ఈ–కామర్స్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ల నుండి ఇంజనీర్ల వరకు పెద్ద ఎత్తున ప్రొఫెషనల్స్​ నియమించుకుంటున్నది.  ఆఫీసులను నిర్మించడానికి టాటా డిజిటల్ ఛైర్మన్‌‌‌‌ , టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వంలో మీటింగ్స్​ ఏర్పాటు చేశారు. టాటా న్యూ యాప్​ను  ఏప్రిల్ 14 నాటికి 22 లక్షల మంది డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకున్నారు. 
సూపర్ యాప్‌‌‌‌ యూజర్ ఫ్రెండ్లీ కాదని, మరింత మెరుగుపర్చడం అవసరమని యూజర్లు అంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు టాటాలు నడుం బిగిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఎక్స్​పర్టులను రంగంలోకి దింపడమేగాక, పేమెంట్స్​, ఆన్‌‌‌‌లైన్ ట్రావెల్​ వంటి సెగ్మెంట్లలోని టెక్నికల్​ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక పేమెంట్​ను పూర్తి చేయడానికి కనీసం నాలుగైదు స్టెప్స్​ను పూర్తి చేయాల్సి వస్తోంది. యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తీసుకురావడానికి టాటా డిజిటల్​ ఎన్​పీసీఐ అనుమతి కోరింది.
పెద్దోళ్లు రంగంలోకి దిగిన్రు
ఈ–-కామర్స్‌‌‌‌లో ఎంతో అనుభవం ఉన్న టాటా డిజిటల్​కు చెందిన ముఖేష్ బన్సల్ చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లను నియమించుకున్నారు. ఫిన్‌‌‌‌టెక్ సంస్థ స్క్రిప్‌‌‌‌బాక్స్ కో–ఫౌండర్,  చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ మెహతా, ఉడాన్ ఫౌండింగ్​ టీమ్​ మెంబర్లు​ భాను పాఠక్, రాజీవ్ సుబ్రమణియన్, క్లియర్‌‌‌‌ట్రిప్ ఇండియా బిజినెస్ మాజీ హెడ్,  ఫ్లిప్‌‌‌‌కార్ట్ ఉద్యోగి ఆసిమ్ సచ్‌‌‌‌దేవా వంటి ప్రముఖులు బోర్డులోకి వచ్చారు. ఫ్లిప్​కార్ట్, మింత్రా నుండి మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు రోహిత్ శర్మ, శరత్ బులుసు కూడా టాటా డిజిటల్‌‌‌‌లో చేరారు.

తాజాగా క్లౌడ్-కిచెన్ వెంచర్ రెబెల్ ఫుడ్స్‌‌‌‌లో ఉన్న మరొక మాజీ ఫ్లిప్‌‌‌‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ శౌమ్యన్ బిస్వాస్ బన్సాల్ మార్కెటింగ్ టీమ్‌‌‌‌లో చేరారు. టాటా న్యూ యూజర్లు సరికొత్త షాపింగ్​ అనుభూతిని పొందేలా చేయడానికి టెక్​ టీమ్​ కష్టపడుతోంది. యాప్​ అత్యంత భారీ స్థాయిలో ఉండకుండా, సింపుల్​గా చేయాలనే ఆలోచన ఉంది  కాబట్టే తమ సంస్థ మరింత మంది ఇంజనీర్లను నియమించుకుంటున్నదని టాటా డిజిటల్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. టాటా డిజిటల్ బెంగళూరులోని హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్ ప్రాంతంలో ఆఫీస్ కోసం స్థలాన్ని తీసుకుంది.  గురుగ్రామ్‌‌‌‌లోని 1ఎంజీ హెడాఫీసు పక్కనే ఉన్న మరొకదాన్ని లీజుకు తీసుకోవచ్చని తెలుస్తోంది. -- గురుగ్రామ్ టీమ్​ను 1ఎంజీకి దగ్గరగా ఉంచడానికే ఈ ప్రయత్నం. 
పూర్తిస్థాయి ఆన్​లైన్​  ట్రావెల్​ ఏజెన్సీ...
టాటా గ్రూపులోని ముఖ్యమైన వెర్టికల్స్​ బిగ్​బాస్కెట్‌​, 1ఎంజీ, క్రోమా వంటి సేవలు ఇది వరకే టాటా న్యూలో అందుబాటులో ఉన్నాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, టైటాన్, తనిష్క్  టాటా మోటార్స్ వంటి వాటిని కూడా ఇందులోకి తీసుకురావాలని గ్రూప్ కోరుకుంటున్నది. మేక్‌‌‌‌ మై ట్రిప్ మాదిరిగానే పూర్తి స్థాయి ఆన్‌‌‌‌లైన్ ట్రావెల్ ఏజెన్సీని నిర్మించాలని ప్రయత్నిస్తున్నది.  టాటాయేతర విమానయాన సంస్థలను కూడా ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తారు. టాటాలకు .. ఎయిర్‌‌‌‌ ఏషియా, విస్తారా  ఎయిర్ ఇండియా అనే మూడు విమాన కంపెనీలు ఉన్నాయి.

హోం సర్వీసెస్​ అందించే అర్బన్ కంపెనీని (గతంలో అర్బన్‌‌‌‌క్లాప్) కూడా నిర్మించే ప్రయత్నంలో టాటా ఉంది. ప్రతి క్వార్టర్​లో ఒక బిజినెస్​ సెగ్మెంట్​ను పెంచాలనేది టాటాల ఆలోచన. టాటాలకు ప్రస్తుతం కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యం, బ్యూటీ, లగ్జరీ, క్రికెట్, వినోదం వంటి 12 సెగ్మెంట్లు ఉన్నాయి.  అమెజాన్​, పేటీఎం, రిలయన్స్​ జియో సూపర్ యాప్​లు.. పేమెంట్స్​, కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్‌‌‌‌లు, కిరాణా సామాగ్రి వంటి సేవలను అందిస్తాయి.