క్రిప్టో ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికే ట్యాక్స్‌‌..

క్రిప్టో ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికే ట్యాక్స్‌‌..
  • ఇన్ కం లీగల్టీని ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పట్టించుకోదన్న ఎక్స్ పర్టులు
  • లీగల్ స్టేటస్‌‌ ఇవ్వడంపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందంటున్న ఇండస్ట్రీ వర్గాలు
  • క్రిప్టో బిల్లు వచ్చేంత వరకు లేని క్లారిటీ

బిజినెస్‌‌ డెస్క్, వెలుగు: బిట్‌‌కాయిన్ వంటి  డిజిటల్ అసెట్లపై బడ్జెట్‌‌లో 30 శాతం ట్యాక్స్ విధించిన విషయం తెలిసిందే. ఒక శాతం టీడీఎస్‌‌ను కూడా క్రిప్టో ట్రాన్సాక్షన్లపై వేశారు. దీన్ని బట్టి క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం లీగలైజ్‌‌ చేసిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ అంశంపై ఎక్స్‌‌పర్టులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. క్రిప్టోలపై ట్యాక్స్‌‌లను వేసినంత మాత్రాన  వీటిని లీగలైజ్‌‌ చేసినట్టు కాదని బ్లాక్‌‌చెయిన్ లా కంపెనీ క్రిప్టో లీగల్ ఫౌండర్ పురుషోత్తం ఆనంద్ అన్నారు.  ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ను ఆదాయాలపై వేస్తారని, ఆ ఆదాయం లెక్కల్లో చూపించారా? లేదా? అనే అంశాన్ని మాత్రమే  ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ చట్టం పట్టించుకుంటుందని చెప్పారు. అంతేగాని ఆ ఆదాయం లీగల్‌‌గా వచ్చిందా? లేదా ఇల్లీగల్‌‌గా వచ్చిందా? అనే విషయాన్ని ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ పట్టించుకోదని అన్నారు.  కానీ, క్రిప్టోలపై ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ట్యాక్స్ ప్రొవిజన్లను చూస్తుంటే, క్రిప్టోలను లీగలైజ్ చేయడానికి ప్రభుత్వం రెండు అడుగులు ముందుకేసినట్టు అనిపిస్తోందని చెప్పారు. లెక్కల్లో చూపించని ఇన్‌‌కమ్‌‌పై పన్నులేసే అధికారం  ప్రభుత్వానికి ఉందని,  అదే విధంగా లీగల్‌‌ అయినా? లేదా ఇల్లీగల్‌‌ అయినా? క్రిప్టో లాభాలపై ప్రభుత్వం పన్నులేయగలదని బీడీఓ ఇండియా అసోసియేట్ పార్టనర్‌‌‌‌ హ్యారీ పారిఖ్ అన్నారు. మరోవైపు క్రిప్టో ట్రాన్సాక్షన్లపై ప్రభుత్వం రెవెన్యూ సంపాదిస్తూ, వీటిని  బ్యాన్‌‌ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించారు. కాగా, క్రిప్టో ఇండస్ట్రీని ఇల్లీగల్‌‌ అని కూడా ప్రభుత్వం ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి.  క్రిప్టో కరెన్సీలను లీగల్‌‌ చేయడంలో ప్రభుత్వం పాజిటివ్‌‌గా ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.  డిజిటల్ అసెట్లన్నింటినీ ట్యాక్స్ సిస్టమ్‌‌ కిందకు తీసుకొచ్చి వీటిని లీగలైజ్‌‌ చేస్తామనే సంకేతాలను ప్రభుత్వం  ఇచ్చిందని మడ్రెక్స్‌‌ సీఈఓ ఎడుల్‌‌ పటేల్ అన్నారు. సరియైన టైమ్‌లో దీనికి సంబంధించి విషయాలు బయపడతాయని పేర్కొన్నారు.

క్రిప్టో ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికే ట్యాక్స్‌‌..
దేశంలో క్రిప్టో ఇండస్ట్రీ ఎంతలా విస్తరించి ఉందో తెలుసుకోవడానికి  ఈ అసెట్లపై విధించే ట్యాక్స్‌‌‌‌‌‌లు సాయపడతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్  డైరెక్ట్‌‌‌‌ ట్యాక్సెస్‌‌‌‌  చైర్మన్‌‌‌‌ జేబీ మొహపాత్ర  అన్నారు.  దీనికి ఎటువంటి లీగల్టీని  ఆపాదించొద్దని చెప్పారు.  క్రిప్టో బిల్లును ప్రభుత్వం తేనుండడంతో, ఈ ఇండస్ట్రీలోకి ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఎంటర్ అవ్వడానికి ఇదే సరియైన టైమ్ అని అన్నారు. ‘క్రిప్టోల లీగల్టీపై జడ్జ్‌‌‌‌ చేయాలని అనుకోవడం లేదు. ఏదైనా ట్రాన్సాక్షన్‌‌‌‌ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌కు రిలేటెడ్‌‌‌‌గా ఉందా? లేదా? అనే అంశాన్ని మాత్రమే ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ చట్టం చూస్తాయి. ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ లీగల్టీ కంటే ఆ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ వేయడంపైనే ఇవి ఎక్కువ ఫోకస్ పెడతాయి’ అని ఆయన చెప్పారు.

ఇన్‌‌‌‌కమ్ ఎలా వచ్చిందో ఆరా తీస్తాం..
 ‘క్రిప్టో ట్రేడ్‌‌‌‌లపై ఏదైనా సంస్థ గాని లేదా వ్యక్తులు కాని  ప్రాఫిట్ లేదా మిగులు నిధులను ప్రకటిస్తే, ఈ అసెట్లలో ఇన్వెస్ట్  చేయడానికి ఫండ్స్ ఎలా వచ్చాయో ఆరా తీస్తాం. ఈ ఫండ్స్‌‌‌‌ న్యాయబద్దంగా ఉంటే ట్యాక్స్ వేస్తాం. ఒక వేళ ఈ క్రిప్టో లెక్కలను చూపించకపోయినా లేదా వేరెవరికో బినామి ఇన్‌‌‌‌కమ్ అయినా, ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’ అని మొహపాత్ర  అన్నారు. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది క్రిప్టో ట్రేడర్లు ఉన్నారని చెబుతున్నారని, ఈ నెంబర్ పది కోట్ల లేదా ఒక కోటా అనేది చూస్తామని పేర్కొన్నారు. కానీ, ఒకటి మాత్రం నిజమని దేశంలో క్రిప్టో ట్రేడింగ్ వాల్యూమ్‌‌‌‌ ప్రస్తుతం ఏడాదికి రూ. లక్ష కోట్లకు చేరుకుందన్నారు.

క్రిప్టో ఇండస్ట్రీ బతకదు..
క్రిప్టో మార్కెట్‌‌ కుప్పకూలుతుందని, కానీ, దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌‌లపై పెద్దగా ఉండదని  సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌ రాకేష్ జున్‌‌జున్‌‌వాలా అభిప్రాయపడ్డారు. షేరు మార్కెట్‌‌, క్రిప్టో మార్కెట్.. రెండు చాలా భిన్నమని, ఏదో ఒక రోజు క్రిప్టో మార్కెట్ కుప్పకూలుతుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం మార్కెట్‌‌లో ఎక్కువ వాల్యూ ఉన్న షేర్లు మాత్రమే పడుతున్నాయని చెప్పారు. నిఫ్టీ 15,000 లెవెల్‌‌ కిందకు రాకపోవచ్చని అంచనావేశారు. మార్కెట్‌‌లో బుల్‌‌రన్‌‌ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సాహసోపేతమైందని, మెజార్టీ కోరికలను పక్కన పెట్టి గ్రోత్‌‌, ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని కామెంట్ చేశారు.

ఐటీఆర్‌‌‌‌‌‌లో క్రిప్టోలకు సపరేట్ కాలమ్‌‌
వచ్చే ఏడాది నుంచి ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌‌(ఐటీఆర్‌‌‌‌) ఫామ్‌‌లలో క్రిప్టో ఇన్‌‌కమ్‌‌కు సంబంధించి సపరేట్ కాలమ్ ఉంటుందని రెవెన్యూ సెక్రెటరీ తరుణ్ బజాజ్‌‌ అన్నారు. క్రిప్టోలపై ట్యాక్స్ వేయడంతో ఈ అసెట్లను లీగలైజ్ చేసినట్టు కాదని పేర్కొన్నారు. క్రిప్టో బిల్లులో దీనిపై ఓ క్లారిటీ వస్తుందని అన్నారు.  క్రిప్టోల్లో ట్రేడింగ్ చేయడం ఇల్లీగల్ అని ప్రభుత్వం పేర్కొలేదని ఫైనాన్స్‌‌ సెక్రటరీ టీవీ సోమనాథన్ అన్నారు.  ‘క్రిప్టోలను కొనడం, అమ్మడం ఇల్లీగల్‌‌ కాదు. క్రిప్టోలు గ్రే ఏరియాలో ఉన్నాయి’ అని ఆయన అన్నారు. గుర్రపు పందేలు, గ్యాంబ్లింగ్ వంటి స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్లపై వేసినట్టే క్రిప్టోలపై ట్యాక్స్‌‌ ఫ్రేమ్‌‌ వర్క్‌‌ను రెడీ చేశామని చెప్పారు. క్రిప్టోలపై ఫ్యూచర్‌‌‌‌లో రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయనేది చర్చించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి ఈ  రెగ్యులేషన్స్‌‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. ప్రస్తుతానికి రెగ్యులేషన్స్ పెట్టడంపై ప్రభుత్వం తొందరపడడం లేదని చెప్పారు.