రూ.200 కోట్ల వ్యయం.. ఈశాన్య భారతాన అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

రూ.200 కోట్ల వ్యయం.. ఈశాన్య భారతాన అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

'సెవన్‌ సిస్టర్స్‌'గా పేరొందిన ఈశాన్య భారతాన అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సిద్ధమవుతోంది. బీసీసీఐ ఆర్థిక సహకారంతో త్రిపురలోని పశ్చిమ త్రిపుర జిల్లా నర్సింగఢ్‌లో దీన్ని నిర్మిస్తున్నారు. బీసీసీఐ, టీసీఏ సంయుక్త సహకారంతో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో 25,000 మంది కూర్చునే సామర్థ్యం ఉండనుంది.

ప్రస్తుతం స్టేడియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా స్టేడియం అందుబాటులోకి రానున్నట్లు త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ (TCA) కార్యదర్శి సుబ్రతా డే తెలిపారు. 2025 ఫిబ్రవరి తర్వాత ఈశాన్య ప్రజలు అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశమున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రస్తుతం అస్సాంలోని బర్సపుర స్టేడియం(Barsapara Cricket Stadium) మాత్రమే ఐపీఎల్‌, ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది.

"అంతర్జాతీయ స్టేడియం ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే మా లక్ష్యం. సవరించిన గడువు ప్రకారం.. 2025 జనవరి లేదా ఫిబ్రవరి మధ్య నాటికి హై-ప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియంను సిద్ధం చేస్తాము. ప్రాజెక్ట్ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. మొదట్లో నిర్ణీత గడువులోగా 22 నెలల వ్యవధిలో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. అయితే, ఏజెన్సీలు పనులను యుద్ధ ప్రాదిపదికన చేయకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. పస్తుతానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. మరింత  వేగవంతం చేయడానికి వారానికోసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం.." అని సుబ్రతా డే జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలోవెల్లడించారు.