బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు.  కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి చేసింది ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే వివేక్. దళిత మంత్రి అని చెప్పుకుని దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 24 వేల సింగరేణి ఉద్యోగులను బర్తరఫ్ చేశారని ఆరోపించారు.  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే ఈడీ విచారణ చేయలేదన్నారు వివేక్.  అమిత్ షా,  మోదీలకు దమ్ముంటే కాళేశ్వరంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని..  రాహుల్ గాంధీ 5 న్యాయలతో అని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.  

మోదీ సర్కార్ దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా పెట్టలేదని..   ప్రైవేట్ సెక్టార్ కే  ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.  దేశంలోని బడా పెట్టుబడిదారులకు మోదీ రూ.16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారన్నారు.  కేసీఆర్ రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తే..  మోదీ రూ.125 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు  కానీ సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. వంశీకృష్ణను మీ సొంత కొడుకు, తమ్ముడు అనుకోని గెలిపించాలని కోరారు.