అధికారం ఉందని ఎవరినీ ఇబ్బంది పెట్టలే..బీఆర్ఎస్ హయాంలోనే  అధికార దుర్వినియోగం

అధికారం ఉందని ఎవరినీ ఇబ్బంది పెట్టలే..బీఆర్ఎస్ హయాంలోనే  అధికార దుర్వినియోగం
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి(పెగడపల్లి), వెలుగు: అధికారం ఉందని తాను ధర్మపురిలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడారు. ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటివరకు ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తెలిపారు. 

బీఆర్ఎస్​హయాంలోనే అధికార దుర్వినియోగం జరిగిందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెల్గటూరు, ధర్మపురి మండలాల్లో ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో అందరికీ తెలుసన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించిన చరిత్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దని విమర్శించారు. యాదాద్రిని అభివృద్ధి చేసినప్పుడు ధర్మపురిని కూడా చేయాలని కేసీఆర్ ను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిచాక సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి, ధర్మపురిలోని నైట్ కాలేజీని తిరిగి ప్రారంభించానని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే  డిగ్రీ కళాశాల, ఐటీఐ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్​రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. అధికారంలో ఉన్న సమయంలో భార్యాభర్తల ఫోన్లు విన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సిరిసిల్లలో పర్యటిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. తాను ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించలేదని చెప్పారు. ధర్మపురిలో జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణులు ఆహ్వానిస్తే వెళ్లానని,  అ సమయంలో కొందరు వీడియోలు తీసి తప్పుడు ప్రచారం చేశారన్నారు.