
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని ఆరోపించారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9%, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 36 కు పైగా ఓటుశాతం పెరిగి, 8 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీకి సున్నా సీట్లు వస్తాయంటూ గతంలో బీఆర్ఎస్ ఎగతాళి చేసేది. ఇప్పుడు బీఆర్ఎస్ పని సున్నా అయింది” అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని తెలిపారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి 70 శాతం ఓట్లు పడ్డాయని, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని గెలిచామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతున్నదని, అందుకే చాలామంది పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజుకు బీజేపీ ప్రైమరీ సభ్యత్వాన్ని అందించారు.
అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. వర్షాల కారణంగా హైదరాబాద్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై దృష్టి సారించి, హైదరాబాద్ అభివృద్ధికి శ్రద్ధ చూపాలని కోరారు. వర్షాలతో అస్తవ్యస్తంగా ఉన్న హైదరాబాద్‌ను పట్టించుకోకుండా ‘గేట్‌వే ఆఫ్ హైదరాబాద్’ అంటూ మాటలు చెప్పడం సరికాదని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ‘గేట్ వే ఆఫ్ తెలంగాణ’గా మారుతుందని, గువ్వల బాలరాజు చేరిక దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓటు వేసినా.. 19 నెలల పాలనలో ఆ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి ప్రజలు నిరాశపడ్డారని అన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తన నెల రోజుల పర్యటనలో జిల్లాల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో మేధావులు, న్యాయవాదులు, రైతులు, యువత, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు చేరాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్ అని విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, బిహార్‌లో కూడా ఓటమి తప్పదని తెలిసి రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. రాహుల్ గాంధీ వెనుక అర్బన్ నక్సల్స్, దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ఓడినా, గెలిచినా ప్రజాస్వామ్యాన్నే నమ్ముతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆ పార్టీ నేతలు తల్లోజు ఆచారి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, తదితరులున్నారు.
ప్రజాసేవకే రాజకీయాల్లోకి: గువ్వల
కొందరు తనను అవకాశవాది అని విమర్శిస్తున్నారని, అయితే తాను ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవం లేదని, వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం బీఆర్ఎస్‌లో చేరానని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తనకు దళితుల అంశాలపై మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని, అయితే తన దృష్టిలో పేదవాడు అంటే కులం, మతంతో సంబంధం లేకుండా పేదరికం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ అని స్పష్టం చేశారు. మళ్లీ ఎమ్మెల్యే లేదా ఎంపీ కావాలనే కోరిక తనకు లేదని చెప్పారు.
బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తానన్నారు. పార్టీ పెద్దల సూచనలతో దేశం, తెలంగాణ రక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తానని వెల్లడించారు. బీజేపీ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ‘‘గరీబీ హటావో’’ నినాదం ఇచ్చి.. దేశాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి పోరాటం జరిగిందో, దేశ రక్షణ కోసం కూడా అలాంటి త్యాగం అవసరమని బాలరాజు చెప్పారు.