టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలకు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించినందుకే అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. దేవినేని ఉమాపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా... ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసులో 100 శాతం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో వివాదం సృష్టించారని డీఐజీ మోహనరావు అన్నారు. ముందస్తుగా అనుకున్నట్లే ఉమా తన అనుచరులతో అక్కడకు వెళ్లారని తెలిపారు. 

కాగా.. తనపై దాడి జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు రాలేదని దేవినేని ఉమా ఆరోపించారు. పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లు విసిరారని చెప్పారు. సీఎం జగన్, సజ్జల నాయకత్వంలోనే తనపై దాడి జరిగిందన్నారు. కొండపల్లి రిజర్వు అడవిలో లక్షల విలువైన గ్రావెల్  దోపిడీ జరిగిందని ఉమా అన్నారు.

కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లాయి. దాడిలో ఉమా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్రమాలపై ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.