తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా.. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వరు?

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా.. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వరు?

సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా ఏపీ, తెలంగాణ విడిపోయినా   అన్నదమ్ములుగా కలిసే ఉందామన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు గుండె పొగరుతో నినదిస్తోంది. సామాన్యుడి కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. 

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్‌కు కాకుండా భారత రత్న ఇంకెవరకీ ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, టీడీపీ అభిమానుల తరుపున బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ ..తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామన్నారు.


ఇంకా ఎన్టీఆర్ పథకాలే... 

ఎన్టీఆర్ తయారు చేసిన నాయకులు ఎంతో మంది వేరే పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ పేరుతో వంద సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిందని..ఆ వెలుగు వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మాభిమానం,ఆత్మగౌరవంను నిలపెట్టింది ఎన్టీఆర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని...ఇప్పుడు ఆ పథకాలకే  పేర్లు మార్చి  నడిపిస్తున్నారని వివరించారు.

 ఎంతో మందికి రాజకీయ భిక్ష

పేదలకు రాజకీయాలు పరిచయం చేసిన నేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. కాంక్రీట్ శ్లాబ్‌తో పక్కా ఇళ్ళను ఎన్టీఆర్ దేశానికి పరిచయం చేశారన్నారు . మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు.ఎందరో నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్షను పెట్టారని వివరించారు.ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలయ్య పిలుపునిచ్చారు.