హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ఏరియా ( కో అర్బన్)లో చెరువులు, నాలాల అభివృద్ధిలో భూమి కోల్పోతున్న వారికి టీడీఆర్(ట్రాన్స్ ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్స్)ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు టీడీఆర్ నిబంధనల్లో కొన్ని కీలక సవరణలు చేస్తూ జీవో నెం.168ను శుక్రవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో టీడీఆర్ మంజూరు, వినియోగం, బదిలీ ప్రక్రియను మరింత స్పష్టంగా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
200 నుంచి 400 శాతం వరకు..
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్సిటీ, ఎస్ఆర్డీపీతో పాటు ఎలివేటెడ్కారిడార్పనుల్లో భూ సేకరణ కోసం టీడీఆర్అమలు చేస్తున్నారు. వీరికి పరిహారంగా నగదు అయితే మార్కెట్వాల్యూకు 200 శాతం అదనంగా ఇస్తున్నారు. ఒకవేళ టీడీఆర్అయితే 400 శాతం వరకు ఇస్తున్నారు. ఇక నుంచి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కార్పొరేషన్లు చేపట్టే చెరువులు, నాలాల అభివృద్ధి పనుల కోసం భూమి సేకరించాల్సి వస్తే టీడీఆర్ అమలు చేయనున్నారు.
అయితే, చెరువులు, నాలాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో సరైన రెవెన్యూ పత్రాలు కలిగి భూములున్న వారు మాత్రమే దీనికి అర్హులు. ఇందులో ఎఫ్టీఎల్లో భూమి కోల్పోతే 200 శాతం, బఫర్ జోన్‌లో 300 శాతం, బఫర్ జోన్ వెలుపల 400 శాతం టీడీఆర్ ఇవ్వనున్నారు. నాలాల వెడల్పు పెంపు, అభివృద్ధి కోసం తీసుకునే ప్రైవేట్ భూములకు 400 శాతం టీడీఆర్ ఇస్తారు. అలాగే, 10 అంతస్తులకు మించి నిర్మించే బిల్డింగుల్లో బిల్ట్ అప్ ఏరియాలో10శాతం తప్పనిసరిగా టీడీఆర్ వినియోగించాలని బిల్డింగ్ రూల్స్ లో మార్పులు కూడా చేసింది.
ఈ నిర్ణయంతో ఇదివరకు నగరంలోని చెరువుల పరిధిలో సరైన పత్రాలు ఉండి భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. హైడ్రా కమిషనర్రంగనాథ్కూడా దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. నగర పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అన్ని పేపర్లు ఉండి ఇండ్లు, భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధితులకు టీడీఆర్వస్తుందని అంటున్నారు.
ఏమిటీ టీడీఆర్..
నగరాల్లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులకు భూసేకరణ ఇబ్బందిగా మారుతోంది. దీనికి టీడీఆర్ ఒక పరిష్కారమని అధికారులుంటున్నారు. ఇందులో భూమి సేకరించిన తర్వాత భూయజమానులకు పరిహారమైతే పరిహారం లేదా ట్రాన్స్ ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తారు. దీని ప్రకారం భూమిని కోల్పోతున్న యజమానికి భూమికి బదులుగా అదనపు నిర్మాణ హక్కులు కల్పిస్తారు.
దీనివల్ల ఓనర్భూమి పోగా మిగిలిన ల్యాండ్లో లేదా నగరం/మున్సిపాలిటీ పరిధిలోని ఇతర చోట్ల సాధారణంగా అనుమతించే అంతస్తుల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు. ఈ హక్కులను యజమాని తాను వాడుకోవచ్చు లేదా వేరే బిల్డర్లు, డెవలపర్లకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అమ్ముకోవచ్చు.
