రవీంద్రభారతిలో టీచర్స్ డే వేడుకలు

రవీంద్రభారతిలో టీచర్స్ డే వేడుకలు
  • 155 మందికి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డులు అందజేత

హైదరాబాద్, వెలుగు: వీలైనంత త్వరలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపడుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. లీగల్ సమస్యలు లేకుండా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, అందుకే ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అది సర్కారు బాధ్యత​అని, టీచర్లు తమను అడగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సోమవారం రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సబితారెడ్డితోపాటు మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, కమిషనర్లు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీదేవసేన, పలువురు వీసీలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన 155 మంది టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు అవార్డులను అందించారు. 

సమాజాన్ని చదివించాలి
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కరోనా టైమ్‌లో పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్లు చేసిన కృషిని ఈ సమాజం మరిచిపోదన్నారు. టీచర్లు పిల్లలకు పాఠాలతో పాటు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి చెప్పాలని సూచించారు. పుస్తకాల్లో ఉన్నదే కాక జీవితాన్ని, సమాజాన్ని చదివించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు మొదలుపెట్టామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రూ.7 వేల కోట్లతో ఫెసిలిటీస్ కల్పించనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బడులకు దీటుగా వసతుల కల్పన కోసం అందరి సహకారం అవసరమన్నారు. చట్టపరంగా రావాల్సిన నిధులను కేంద్రం తెలంగాణకు ఇవ్వడం లేదని, పిల్లల విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలను మేనేజ్‌మెంట్లు వ్యాపార సంస్థలుగా మారుస్తున్నాయని చెప్పారు. మనం చదువు చెప్పిన పిల్లలను, తమ వాళ్లంటూ వాళ్లు ర్యాంకులు ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు.