ఆగస్టు 2న 25 వేల మంది టీచర్లతో సీఎం సభ

ఆగస్టు 2న 25 వేల మంది టీచర్లతో సీఎం సభ
  • ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు 
  • 5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టిన టీచర్ల జేఏసీ 
  • నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇటీవల ప్రమోషన్లు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కృతజ్ఞతా సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి టీచర్లను నగరానికి తీసుకురానున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు నోడల్ ఆఫీసర్లుగా ఉండి  కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీచర్ల జేఏసీ నేతలతో బుధవారం అసెంబ్లీలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.  టీచర్ల నేతలు ప్రధానంగా 5 డిమాండ్లను సర్కారు ముందుపెట్టారు. కామన్ సర్వీస్ రూల్స్ అమలు, సీపీఎస్ రద్దు, పీఎస్ హెచ్ఎం పోస్టులు, స్కూళ్లకు ఉచిత విద్యుత్, బడుల్లో స్వీపర్ల ఏర్పాటు లాంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వేం నరేందర్ రెడ్డి చెప్పినట్టు టీచర్ల జేఏసీ నేతలు తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ఈ డిమాండ్లలో కొన్నింటిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీచర్ల జేఏసీ నేతలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. సభ విజయవంతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో టీచర్ల జేఏసీ నేతలు బీరెల్లి కమలాకర్​రావు, మారెడ్డి అంజిరెడ్డి, కృష్ణుడు, జంగయ్య, అశోక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.