
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఆడడం అనుమానంగా మారింది. శనివారం (సెప్టెంబర్ 13) ప్రాక్టీస్ సెషన్ లో గాయపడడమే ఇందుకు కారణం. వస్తున్న సమాచార ప్రకారం దెబ్బ తగిలిన తర్వాత గిల్ దెబ్బ అసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే ప్రాక్టీస్ ఆపేసి చికిత్స తీసుకోవడానికి ఫిజియో దగ్గరకు వెళ్ళాడు. గాయపడిన చేతిని పట్టుకుని ఐస్ బాక్స్ మీద కూర్చున్నాడు.
గిల్ గాయపడిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. గిల్‌తో చాలా సేపు మాట్లాడాడు. కొన్ని నిమిషాల తర్వాత గిల్ తిరిగి నెట్స్‌లోకి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. రిస్క్ ఎందుకు అని భావిస్తే పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కు గిల్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గిల్ మ్యాచ్ ఆడకపోతే అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. గిల్ స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కనుంది. రింకూ మిడిల్ ఆర్డర్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ లో యూఏఈపై గిల్ 9 బంతుల్లోనే 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ కు ఇదే తొలి టీ20. ఈ మ్యాచ్ కోసం ఇండియా కూడా కొత్త వ్యూహాలను రెడీ చేసింది. అయితే బౌలింగ్ కంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పాక్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేకు ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొనే సత్తా ఉంది. దాంతో వీళ్లను ఆపే బౌలింగ్ దాడి ప్రస్తుతం పాక్ దగ్గర కనిపించడం లేదు.
గిల్ దూరమైతే టీమిండియా తుది జట్టు: (అంచనా)
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా