
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత్ దాయాది దేశాన్ని చిత్తు చేసింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47) రాణించడంతో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు.
ఆదిలోనే పాక్‌కు ఎదురు దెబ్బ:
టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సయిమ్ అయూబ్ తొలి బంతికే హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో డకౌటయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే రెండో ఓవర్లో మహమ్మద్ హరీస్‌ను పెవిలియన్‌కు పంపాడు బుమ్రా. దీంతో 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.
వికెట్ కాపాడుకునే క్రమంలో ఫఖర్ జమాన్, ఫర్హాన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఫఖర్ జమాన్‌తో పాటు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నాలుగు పరుగుల వ్యవధిలో వెనువెంటనే ఔటయ్యారు. అసలే కష్టాల్లో ఉన్న పాక్ జట్టుకు కుల్దీప్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 13 ఓవర్లో హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్‌లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 64 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది చివర్లో జట్టును ఆదుకున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 4 సిక్సర్లతో 33 పరుగులు చేసి పాక్ స్కోర్‌ను 120 పరుగుల మార్క్‌కు చేర్చాడు. భారత బౌలర్ల విజృంభణతో తొలి 10 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన పాకిస్థాన్.. చివరి 10 ఓవర్లలో 78 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ఓవరాల్‌గా నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది పాక్.
భారత్ ఆడుతూ.. పాడుతూ..
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయసంగా టార్గెట్‌ను ఛేధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31) మెరుపు ఆరంభం ఇవ్వగా.. ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (47), తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (31) రాణించడంతో భారత్ విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో టెస్ట్ కెప్టెన్ గిల్ ఒక్కడే నిరాశ పర్చాడు.
అభిషేక్‌తో కలిసి ఇన్సింగ్స్ ప్రారంభించిన గిల్ రెండు ఫోర్లు బాది మంచి టచ్‌లో కనిపించాడు. కానీ ఆ తర్వాత వెంటనే సయిమ్ అయూబ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్టంప్ ఔట్ అయ్యాడు. గిల్ (10) ఔట్ అయిన అభిషేక్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ సూర్యతో కలిసి పాక్ బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో ఎదురుదాడి చేశాడు. 13 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది 31 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో వేగంగా ఆడబోయి సయిమ్ అయూబ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు అభిషేక్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్య ఇన్సింగ్స్ గాడినపెట్టారు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుతీసుకెళ్లారు.
ఈ క్రమంలో సూర్య, తిలక్ భాగస్వామ్యాన్ని సయిమ్ అయూబ్ విడదీశాడు. అద్భుతమైన బంతితో తిలక్ వర్మ (31)ను క్లీన్ బౌల్డ్ చేశాడు సయిమ్ అయూబ్. అప్పటికే టీమిండియా విజయం ఖరారు కావడంతో కెప్టెన్ సూర్య (45) చివరి వరకు అజేయంగా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేశాడు.