కోహ్లీసేన పింక్‌‌ బాల్‌‌ ప్రాక్టీస్‌‌

కోహ్లీసేన పింక్‌‌ బాల్‌‌ ప్రాక్టీస్‌‌

అహ్మదాబాద్‌‌: ఇంగ్లండ్‌‌తో బుధవారం నుంచి మొదలయ్యే పింక్‌‌ బాల్‌‌ టెస్ట్‌‌ కోసం కోహ్లీ సేన ఆదివారం నెట్స్‌‌లో తీవ్రంగా శ్రమించింది. గ్రౌండ్‌‌లో స్ట్రెచ్చింగ్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌లు, ఫీల్డింగ్‌‌ డ్రిల్స్‌‌ చేసిన ప్లేయర్లు  ఆ తర్వాత నెట్స్‌‌లో చెమటోడ్చారు. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, వైస్‌‌ కెప్టెన్‌‌ అజింక్యా రహానె, రోహిత్‌‌ శర్మ, రిషబ్‌‌ పంత్‌‌ చాలా సేపు బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశారు. జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, సిరాజ్‌‌ వీళ్లకి పింక్‌‌ బాల్‌‌తో బౌలింగ్‌‌ చేశారు. ఇక, కెరీర్‌‌లో 100వ టెస్ట్‌‌ ఆడనున్న ఇషాంత్‌‌ శర్మ కూడా చాలాసేపు బౌలింగ్‌‌ చేశాడు. చెన్నైలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్లు మెజారిటీ వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్‌‌తో జరిగిన గత పింక్‌‌ మ్యాచ్‌‌లో మొత్తం 20 వికెట్లు పేసర్లకే దక్కాయి. ఈ నేపథ్యంలో బుమ్రా, ఇషాంత్‌‌, సిరాజ్‌‌ థర్డ్‌‌ టెస్ట్‌‌లో కీలకం కానున్నారు. మరోపక్క స్పిన్నర్లు అశ్విన్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌ కూడా బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశారు. అశ్విన్‌‌, అక్షర్‌‌ ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ.. కుల్దీప్‌‌ పింక్‌‌ బాల్‌‌ ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ను బాగా యూజ్‌‌ చేసుకున్నాడు. ఓపెనర్లు మయాంక్‌‌ అగర్వాల్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ కూడా తమ బ్యాట్స్‌‌కు పని చెప్పారు. వీరిద్దరిలో ఒకరు రోహిత్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ స్టార్ట్‌‌ చేయనున్నారు. మరోపక్క ఇంగ్లండ్‌‌ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్‌‌లో పాల్గొన్నారు.