న్యూఢిల్లీ:టెక్ మహీంద్రా కెనడాకు చెందిన అల్లూరి టెక్నాలజీస్ (అవంత్) సంస్థను కొనుగోలు చేస్తోంది. మొదట 85 శాతం వాటాను 28 మిలియన్ల కెనడియన్ డాలర్లకు (దాదాపు సుమారు రూ.171 కోట్లు) దక్కించుకోనుంది. మిగిలిన 15 శాతం వాటాను వచ్చే మూడేళ్లలో కొంటుంది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో టెక్ మహీంద్రా తన పట్టును పెంచుకోనుంది.
ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్లో పేమెంట్స్, వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్స్ వంటి సేవలను విస్తరించడానికి ఇది దోహదపడుతుంది. అల్లూరి టెక్నాలజీస్ ఎండీ, సీఈఓ శ్రీనివాస వర్మ మాట్లాడుతూ టెక్ మహీంద్రా గ్లోబల్ నెట్‌వర్క్ సాయంతో తమ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

