గోదావరిలో ఉన్న నీళ్లెన్ని?..తేల్చేందుకు టెక్నికల్ కమిటీ

గోదావరిలో ఉన్న నీళ్లెన్ని?..తేల్చేందుకు టెక్నికల్ కమిటీ
  • కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదిస్తూ గోదావరి బోర్డు లేఖ
  • తెలంగాణ, ఏపీ సహా గోదావరి రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు
  • కేంద్రం ఆమోదించే దాకా తెలంగాణ, ఏపీ ఆఫీసర్లతో కమిటీ 
  • తెలంగాణకు ఇక నీళ్లు లేవంటూ ఏపీ ఎజెండా..
  • పోలవరం డెడ్ స్టోరేజ్ లిఫ్ట్ అక్రమమన్న తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: గోదావరిలో నీళ్ల లెక్కతేల్చేందుకు కొత్తగా ఒక టెక్నికల్ కమిటీ వేయాలని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు భావిస్తున్నది. గోదావరి బేసిన్‌‌లోని తెలంగాణ, ఏపీసహా 7 రాష్ట్రాల హైడ్రాలజీ, ఇంటర్ స్టేట్ సీఈలు, సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సీఈ, గ్రౌండ్ వాటర్ శాఖ, ఐఎండీ, నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు, నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ హైదరాబాద్ సీఈ, గోదావరి, కృష్ణా బోర్డుల టెక్నికల్ మెంబర్స్ ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించనున్నారు. 

కమిటీకి చైర్మన్ గా జీఆర్ఎంబీ చైర్మన్ వ్యవహరిస్తారు. ఈ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇటీవలే కేంద్ర జల శక్తి శాఖకు గోదావరి బోర్డు చైర్మన్ ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. ఆగస్టు 18న బోర్డు 18వ మీటింగ్ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ఎజెండాను బోర్డు సిద్ధం చేసి బేసిన్ రాష్ట్రాలకు పంపించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎజెండా అంశాలను ఎజెండాలో పొందుపరిచింది. నీటి లభ్యతపై అధ్యయన కమిటీకి కేంద్రం ఆమోదం తెలిపే వరకు.. తెలంగాణ, ఏపీతో ఒక జాయింట్ కమిటీని వేసి అధ్యయనం చేయించాలని భావిస్తున్నట్టు ఎజెండాలో బోర్డు పేర్కొంది.

పాత స్టడీస్​పై వరుస సమీక్షలు

గోదావరిలో జలాల లభ్యతపై గోదావరి బోర్డు గత రెండు నెలల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించింది. ఉమ్మడి ఏపీలో వాప్కోస్ సంస్థ 1940 నుంచి 1994 వరకు ఉన్న డేటా ఆధారంగా అధ్యయనం చేసి రీజెనరేషన్ ద్వారా వచ్చే 70 టీఎంసీలు కలిపి 1430 టీఎంసీల లభ్యత ఉన్నట్టు తేల్చింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో సీడబ్ల్యూసీ 2023లో స్టడీ చేసి 1435 టీఎంసీలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఈ స్టడీస్ పై ఈ ఏడాది మే, జూన్‌‌లలో గోదావరి బోర్డు సమీక్షలు చేసింది. 

మే 7న వాప్కోస్, మే 8న సీజీడబ్ల్యూబీలతో చర్చించింది. జూన్ 2న సీడబ్ల్యూసీ బృందం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైడ్రాలజీ అధికారులు, ఎన్‌‌డబ్ల్యూడీఏ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించింది. జూన్ 9న ఎన్‌‌డబ్ల్యూడీఏ ప్రతినిధులతో వాటర్ బ్యాలెన్స్ స్టడీస్‌‌పై భేటీ అయింది. అయితే, జూన్ 2న జరిగిన భేటీలో తెలంగాణ, ఏపీలు పలు అంశాలను లేవనెత్తాయి. 1969- – 1975 మధ్య గోదావరి ట్రిబ్యునల్ ముందు బేసిన్ రాష్ట్రాలు సమర్పించిన వాదనలు, ప్రణాళికాబద్ధ వినియోగాల ఆధారంగానే సీడబ్ల్యూసీ రాష్ట్రాల వాటాలను లెక్కించాలని తెలంగాణ కోరింది. 

తాము 2023లో రాసిన లేఖ ప్రకారం 1,486 టీఎంసీల వినియోగానికి కట్టుబడి ఉన్నామని ఏపీ స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ వేసి అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఈ క్రమంలోనే టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై గోదావరి బోర్డు నిర్ణయం తీసుకున్నది. 

తెలంగాణకు నీళ్లు లేవు: ఏపీ 

తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ఎజెండాలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విభజన తర్వాత తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం (240 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (67.05 టీఎంసీలు), చౌటపల్లి హనుమంత్ ‌‌రెడ్డి (0.8 టీఎంసీ), ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీలు), చనాకా కొరట (1.2 టీఎంసీలు), మోడికుంటవాగు (2.047 టీఎంసీలు), కడెం–గూడెం లిఫ్ట్ (3 టీఎంసీలు) ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ- టీఏసీ ఇచ్చిన అనుమతులను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేసింది. 

సమ్మక్క సాగర్ అనుమతులను నిలిపివేయాలని, తుమ్మిడిహెట్టి నుంచి తోడే నీటిని 20 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పెంచే ప్రక్రియను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రీ-ఇంజనీరింగ్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 273.16 టీఎంసీల నీటిని వాడుకుంటున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 265 టీఎంసీల వాటా కంటే ఇది 8.16 టీఎంసీలు ఎక్కువని వాదించింది. కాబట్టి తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు నీళ్లు లేవని ఎజెండాలో పేర్కొంది. 

గోదావరి జలాల వినియోగంపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రాజెక్టుల 940.87 టీఎంసీలకు సంబంధించి టీఏసీ అనుమతుల వివరాలు సమర్పించాలని, షెడ్యూల్-2లోని మాచ్‌‌ఖండ్, సీలేరు పవర్ ప్రాజెక్టుల సవరణలు, పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ ఖర్చులో 18 శాతం తెలంగాణ భరించాలని డిమాండ్ చేసింది.  

పోలవరం లిఫ్ట్‌‌ను ఆపెయ్యాలి: తెలంగాణ

ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తన ఎజెండాలో స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తోడేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పోలవరం ఎత్తిపోతల పథకంపై ఏపీ ముందుకు వెళ్తోందని, డిజైన్ చేసి ముందడుగు వేస్తోందని తెలంగాణ మండిపడింది. 

డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తోడటం నిబంధనలకు విరుద్ధమని, పనులు నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏలు ఇప్పటికే ఏపీని ఆదేశించినా ముందుకు వెళ్తోందని, జీఆర్‌‌ఎంబీ తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.

ఏపీ చేపట్టిన బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల సమాచారం బోర్డుకు అందలేదని, వరద నీటిపై ఆధారపడి కడుతున్న ఈ ప్రాజెక్టుల డిజైన్ సీడబ్ల్యూసీ 2025 జులై మార్గదర్శకాలకు విరుద్ధమని, వీటికి అప్రైజల్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది.