బీర్ బాటిల్స్ కోసం యువకుడి హత్య

బీర్ బాటిల్స్ కోసం యువకుడి హత్య
  • పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
  • జిల్లెలగూడలో ఘటన

ఎల్​బీనగర్, వెలుగు:  బీర్ బాటిల్స్ కోసం యువకుడితో గొడవపడ్డ కొందరు వ్యక్తులు అతడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన మీర్​పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వోదయనగర్ కాలనీలో ఉంటున్న సాయి వరప్రసాద్(22)  కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సాయి వరప్రసాద్, అతడి ఫ్రెండ్స్ ధనుష్, భార్గవ్ ముగ్గురు కలిసి మద్యం తాగాలనుకున్నారు. ధనుష్, భార్గవ్ బీర్ బాటిల్స్ తెచ్చేందుకు లలితానగర్​కు వెళ్లారు. వాళ్లు ఎంతకీ తిరిగిరాకపోవడంతో సాయి వరప్రసాద్ బైక్​పై   బయలుదేరాడు. 

కొంతదూరం వెళ్లాక ఫ్రెండ్స్ కనిపించడంతో అతడు బైక్​ను యూటర్న్ తీసుకున్నాడు. జిల్లెలగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు బీర్ బాటిల్స్ కోసం వీరిని ఆపేందుకు యత్నించారు. భార్గవ్, ధనుష్ తప్పించుకోగా.. సాయి వరప్రసాద్ బైక్​ను సదరు వ్యక్తులు అడ్డగించారు. తనను ఎందుకు అడ్డుకున్నారని సాయి వరప్రసాద్ వారిని ప్రశ్నించాడు. దీంతో నిందితులు అతడితో గొడవకు దిగి కత్తితో పొడిచారు. 

తీవ్రంగా గాయపడ్డ సాయి వరప్రసాద్ తన ఫ్రెండ్ యాదవ్​కు కాల్ చేశాడు. అక్కడికి చేరుకున్న యాదవ్ గాయపడ్డ సాయి వర ప్రసాద్​ను హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా..  నిందితులు అతడిపై కూడా దాడికి పాల్పడ్డారు. యాదవ్ మెడలోని చైన్​ను లాక్కునేందుకు యత్నించారు. ఈలోగా ధనుష్, భార్గవ్ అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ సాయి వరప్రసాద్​ను ఒవైసీ హాస్పిటల్​కు తరలించారు. 

అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున సాయి వరప్రసాద్ మృతి చెందాడు. అతడి తండ్రి కృష్ణ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు ఫైల్ చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ నితీశ్ గౌడ్, మహేందర్ రెడ్డి, కిరణ్, మనోహర్, సురేశ్, వెంకటేశ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.  మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  నిందితులను ఉరి తీయాలంటూ సాయి వరప్రసాద్ డెడ్ బాడీతో కుటుంసభ్యులు జిల్లెలగూడ మెయిన్ రోడ్ బైఠాయించి ఆందోళన చేశారు.