తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. రేపు అంటే జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు, మార్కులు పెంచుకోవాలనుకున్న విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన మూల్యాంకనం పూర్తి చేసి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.టెన్త్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థులంతా రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలను చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
