కొత్త కారు కొనుక్కుని, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకున్న ఒక కస్టమర్‌కు కేవలం నాలుగే రోజుల్లో ఊహించని షాక్ తగిలింది. రూ.19 లక్షలకు పైగా ఖర్చు చేసి కొన్న సరికొత్త ఎలక్ట్రిక్ కారు రోడ్డు మధ్యలో ఆగిపోవడమే కాకుండా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. బాధితుడికి రూ.19.56 లక్షలు రీఫండ్ చేయాలని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా'తో పాటు సదరు డీలర్‌ను వినియోగదారుల కోర్టు ఆదేశించింది. కొత్త వాహనాలు కొన్న కొద్దిరోజులకే నాణ్యత, సర్వీస్ లోపాలు తలెత్తితే వాహన తయారీదారులు బాధ్యత వహించాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేసింది.
పుఖ్‌రాజ్ సింగ్ బాల్ అనే వ్యక్తి జూలై 2025లో సుమారు రూ.19 లక్షల 7వేలు వెచ్చించి 'ఎంజీ విండ్సర్ ఈవీ ఎసెన్స్ ప్రో' ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. డెలివరీ తీసుకున్న 4వ రోజే తన ఫ్యామిలీతో ప్రయాణిస్తుండగా కారులో సాంకేతిక లోపం తలెత్తింది. రోడ్డుపై వెళ్తుండగానే కారు ఒక్కసారిగా ఆగిపోయింది. దీనివల్ల వెనుక నుంచి వస్తున్న మరో వాహనం ఈ ఎలక్ట్రిక్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కస్టమర్ ఫ్యామిలీ తీవ్ర భయాందోళనకు గురైంది. అనంతరం ఆ వాహనాన్ని డీలర్ వర్క్‌షాప్‌నకు తరలించారు. అయితే వారాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. పైగా వర్క్‌షాప్ కస్టడీలో ఉన్న సమయంలో కారు మరింత దెబ్బతిన్నట్లు బాధితుడు గుర్తించాడు. డీలర్, కంపెనీల స్పందనపై విసుగు చెంది కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు సదరు కస్టమర్.
మరోవైపు ఎంజీ మోటార్స్, డీలర్ తమ వైపు తప్పులేదని వాదించారు. కారులో ఎలాంటి తయారీ లోపం లేదని, కారులోని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సాధారణంగానే పనిచేసిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ పరిస్థితుల వల్ల ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ కావడం వల్లే కారు ఆగిందని, డెలివరీ అయిన నాలుగు రోజుల్లోనే కారు 485 కిలోమీటర్లు తిరిగినందున వాహనం బాగానే ఉందని కోర్టుకు తెలిపారు. అయితే వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ అమ్రీందర్ సింగ్ సిద్ధూ, సభ్యుడు బి.ఎమ్. శర్మలతో కూడిన ప్యానెల్ ఈ వాదనలను తోసిపుచ్చింది.
కారు అకస్మాత్తుగా ఆగిపోవడానికి కేవలం ఏడీఏఎస్ ఆటోమేటిక్ బ్రేకింగ్ మాత్రమే కారణమని నిరూపించడానికి కంపెనీ ఎలాంటి ఈవెంట్ డేటా రికార్డర్ లాగ్‌లు, డయాగ్నోస్టిక్ రిపోర్టులు, నిపుణుల విశ్లేషణలను కోర్టుకు సమర్పించలేకపోయిందని కమిషన్ నిలదీసింది. అంతేకాకుండా వర్క్‌షాప్‌లో పార్క్ చేసి ఉన్న సమయంలో థర్డ్ పార్టీ వల్ల కారు దెబ్బతిన్నట్లు డీలర్ అంగీకరించడం వారి సేవా లోపాన్ని, నిర్లక్ష్యాన్ని నిరూపిస్తోందని పేర్కొంది. ఒక కొత్త కారు కోసం రూ.19 లక్షలకు పైగా ఖర్చు చేసే వినియోగదారుడు హెస్ట్ పెర్ఫామెన్స్ ఆశిస్తాడని స్పష్టం చేస్తూ.. కారు ధరకు గాను రూ.18లక్షల 49వేలు, యాక్సెసరీల కోసం పెట్టిన రూ.57వేల 690 రీఫండ్ చేయడంతో పాటు, మానసిక క్షోభకు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది.
